
శ్రీమందిరం ఎక్కేందుకు యత్నం
● అదుపులోకి తీసుకున్న పోలీసులు
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథ ఆలయం శిఖరం పైకి ఎక్కేందుకు యత్నించిన వ్యక్తిని ఆలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో శ్రీమందిరం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తి చర్చనీయాంశం అయ్యాయి. శ్రీమందిరం సముదాయంలో నృసింహ స్వామి మందిరం సమీప పశ్చిమ ద్వారం వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు ఉత్తరప్రదేశ్ అజంగఢ్ జిల్లాకు చెందిన మనోజ్ సింగ్‌గా గుర్తించారు. అతడు నృసింహ మందిరం వైపు నుంచి ఆలయం శిఖరం పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. సకాలంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడి ప్రయత్నం అడ్డుకుని సురక్షితంగా కిందకు దించారు. వెంటనే అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం శ్రీమందిరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇటీవల తరచూ ఘటనలు..
ఇటీవల కాలంలో శ్రీమందిరంలో ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం కలవరపరుస్తున్నాయి. ఈ ఘటనలతో శ్రీమందిరం భద్రతా వ్యవస్థ పటిష్టతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవలే రాంచీకి చెందిన ఒక భక్తుడు దక్షిణి ఘరా (దక్షిణ ద్వారం వైపు) సమీపంలో ఉన్న మందిరం ప్రాంగణం నుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు పట్టుబడ్డాడు. అదేవిధంగా గంజాం జిల్లాకు చెందిన మరో భక్తుడు ఆలయ బయటి గోడలను ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు. పదేపదే ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో పవిత్ర శ్రీక్షేత్రం భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది. వీటి నివారణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తరచూ హామీ ఇస్తున్నారు. అటువంటి ప్రయత్నాలను ఆపడానికి ఏకాదశి మందిర్ మరియు దక్షిణి ఘొరొ సమీపంలో ఇటీవల బారికేడ్లను నిర్మించినట్లు పూరీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రకటించారు. అయితే తాజా సంఘటనతో ఈ చర్యలు చొరబాటు ప్రయత్నాలను నివారించడంలో అక్కరకు రావడం లేదని స్పష్టం అయింది. ప్రస్తుత భద్రతా ఏర్పాట్ల పటిష్టతపై అనుబంధ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది.