
బీఎస్‌ఈ, సీహెచ్‌ఎస్‌ఈ విలీనం
భువనేశ్వర్: రాష్ట్రంలో మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్‌ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్‌ఎస్‌ఈ) విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక లోక్ సేవా భవన్‌లో పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ వివిధ కార్యకలాపాలను సమీక్షించిన సందర్భంగా ప్రతిపాదించిన ఆమోదంపై ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.
ఒకే బోర్డు ఆధ్వర్యంలో పాఠశాల విద్య
పాఠశాల విద్యా వ్యవస్థని ఒకే బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాలని భారీ సంస్కరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్‌ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్‌ఎస్‌ఈ) లను ఒకే విద్యా బోర్డుగా విలీనం చేస్తారు. విద్యా బోధన వ్యవస్థ సామర్థ్యం, పాలనను మెరుగుదల లక్ష్యంగా ఈ విలీనం సంకల్పించినట్లు ప్రకటించారు.
విద్యార్థి సంక్షేమ చర్యలు
అన్ని వర్గాల 9, 10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తారు. ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యం పొందుతున్నారు. హాస్టళ్లలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రతి 300 మంది విద్యార్థులకు ఒక బహుళార్థ సాధక ఆరోగ్య కార్యకర్తతో సహాయక నర్స్ మిడ్‌వైవ్‌లను (ఏఎన్‌ఎంలు) నియమిస్తారు.
గిరిజన బాలలకు మాతృభాషలో బోధన
గిరిజన పిల్లలకు వారి మాతృ భాషలో బోధించడంపై ముఖ్యమంత్రి దృషి్‌ట్ సారించారు. కొరాపుట్‌లో బహుభాషా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనంగా, దివ్యాంగ బాలల బోధన కోసం బి.ఎడ్. అర్హత కలిగిన ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్‌లుగా నియమిస్తారు.
మూడేళ్లలో 44,433 మంది
ఉపాధ్యాయుల నియామకం
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఏటా దాదాపు 15,000 మంది వంతున రానున్న 3 ఏళ్లలో 44,433 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020కి అనుగుణంగా ఉపాధ్యాయ పదవుల ఖాళీలను భర్తీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,292 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,60,319 మంజూరు చేయబడిన ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఎన్‌ఈపీ 2020 మార్గదర్శకాల మేరకు మరో 39,366 ఉపాధ్యాయ పదవులు సృష్టిస్తారు.
డిజిటల్ ప్రోత్సాహం, సంస్థాగత బలోపేతం
ప్రైవేట్ పాఠశాలలకు ఆమోదం ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ చేస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ)గా పునరుద్ధరిస్తారు. సమావేశంలో పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజీవ్ మిశ్రా, పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ కార్యదర్శి షాలిని పండిట్, ఓఎస్‌ఈపీఏ డైరెక్టర్, ఆ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.