
దివ్యాంగురాలిని మోసగించిన వ్యక్తి అరెస్టు
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి గగుడిగుమ్మ గ్రామంలో దివ్యాంగురాలని మోసగించిన కేసులో అదే గ్రామానికి చెందిన యువకుడు నగేష్ ధనును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నగేష్ దివ్యాంగురాలైన యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిజమని నమ్మిన ఆమె శారీరకంగా అతనికి దగ్గరైంది. దీంతో గర్భవతయ్యింది. తొమ్మిది నెలల నిండిన అనంతరం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. గ్రామస్తుల సమక్షంలో తానే ఆ శిశువుకు తండ్రినని నగేష్ అంగీకరించాడు. కొద్దిరోజులు గడిచిన తరువాత తనను విడిచిపెట్టి వెళ్లిపొయాడు. దీంతో యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమెదు చేసిన పోలీసులు సోమవారం నగేష్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
చోరీ కేసులో బాలుడితోపాటు ఇద్దరు అరెస్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసులు ఒక దొంగతనం కేసులో బాలుడితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి కేసు దర్యాప్తు అధికారి దీరేంద్ర బారిక్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బొయిపరిగుడ నివాసి బి.భాస్కరరావు విఐపి కాలనీలో సొంతిల్లు కడుతూ జయపురంలో ఉంటున్నారు. ఈ నెల 8 వ తేదీన ఇంటిని చూసేందుకు జయపురం నుంచి బొయిపరిగుడ వచ్చారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే మూడు వాటర్ పంపు మోటార్లు, మూడు ఇనుప రాడ్ల బండిళ్లతో పాటు కొన్ని సామాన్లు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బొయిపరిగుడ సమితి పల్లిగుడ గ్రామంలో ఇద్దరిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగతనం చేసినట్లు వారు అంగీకరించారు. వారిలో ఒకరు బాలుడు కాగా మరొకడు పల్లిగుడ వాసి ధీనబందు బాగధెరియ (27) అని పోలీసు అధికారి వెల్లడించారు. బాలుడి ఇంటిలో రెండు వాటర్ పంపు మోటారులు, కొన్ని ఇనుప రాడ్ల బండిళ్లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు.