
కనుమరుగైన గిరిధారి అలంకరణ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుడు నిత్య శోభాయమానుడు. ఏడాది పొడవునా నిత్య నూతనంగా శోభిల్లుతాడు. పవిత్ర భాద్రపద మాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ప్రారంభమైన వేడుకలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా భాద్రపద మాసం కృష్ణ పక్ష త్రయోదశి నాడు శ్రీమందిరం రత్న వేదికపై మూల విరాటులు కృష్ణ బలరాం, యోగమాయ అలంకరణలో శోభిల్లాడు. వాస్తవానికి శ్రీమందిరంలో గిరి గోవర్ధన్ అలంకరణ కనుమరుగు కావడంతో ఈ అలంకరణ కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్న ధూపం తర్వాత ఈ అలంకరణ సన్నాహాలు ప్రారంభించారు. రత్న వేదికపై బలభద్ర స్వామి బలరాముడి రూపంలో, మహాప్రభు శ్రీ జగన్నాథుడు శ్రీ కృష్ణుని రూపంలో, దేవి సుభద్రను యోగమాయ అలంకరణతో రూపుదిద్దారు. గతంలో ఏటా భాద్రపద మాసం కృష్ణ పక్ష త్రయోదశి నాడు స్థానిక పెద్ద ఒడియా మఠం ఆధ్వర్యంలో శ్రీమందిరం రత్న వేదికపై శ్రీ జగన్నాథునికి గిరిధారి అలంకరణ జరిగేది. కాలక్రమేణా కొన్ని సమస్యల కారణంగా ఈ అలంకరణ నిలిపి వేశారు. దీర్ఘకాలం తర్వాత 1943 సంవత్సరంలో ఈ అలంకరణ పునరుద్ధరించినా తాత్కాలికంగానే కొనసాగింది. కటక్ జిల్లా సాలేపూర్ ప్రాంతం ఖొండొసాహి జమీందార్ రాయ సాహెబ్ చౌదరి గోపబంధు మిశ్రా పుత్ర సంతానం కోసం భగవంతుడిని ప్రార్థించి ఒక కొడుకును పొందాడు. ఈ సందర్భంగా దివంగత సదాశివ రథశర్మ, పుష్పాలక్ సేవకుడు అలేఖ్ కొరొ కోరిక మేరకు, సాహెబ్ నిలిపివేసినగిరి గోవర్ధన్ అలంకరణ పునరుద్ధరణకు అంగీకరించారు. యథాతథంగా పూర్వ రీతిలో పెద్ద ఒడియా మఠం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అలంకరణ కొద్ది కాలం మాత్రమే కొనసాగింది. ఈ అలంకరణ నిర్వహణలో వివిధ అడ్డంకులు ఎదురు కావడంతో ప్రముఖుల సంప్రదింపుల మేరకు శ్రీ మందిరంలో కృష్ణ బలరాం అలంకరణ నిర్వహించాలని నిర్ణయించారు. తదనుగుణంగా గజపతి రాజుల శాసనం ప్రకారం 1945 సంవత్సరం నుంచి ఏటా భాద్రపద కృష్ణ పక్ష త్రయోదశి నాడు క్రమం తప్పకుండా కృష్ణ బలరాం అలంకరణ కొనసాగుతోంది.

కనుమరుగైన గిరిధారి అలంకరణ