
వీడియో దుమారం
బాధితురాలి వాంగ్మూలం..
● భగ్గుమన్న విపక్షం
● ప్రామాణికత ధ్రువీకరణకు పోలీసుల కసరత్తు
భువనేశ్వర్: పూరీ జిల్లా నిమాపడా నియోజక వర్గం బొలొంగా ప్రాంతంలో అగ్నికి ఆహుతైన బాధితురాలి వాంగ్మూలం వీడియో ప్రసారం దుమారం రేపింది. బాలిక మరణంపై సందిగ్ధత తొలగని పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న దశలో రికార్డు చేసిన వీడియో ప్రసారం కావడం కలకలం రేపింది. ఈ ప్రసారంపై విపక్ష బిజూ జనతా దళ్ భగ్గుమంది. న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఒక మహిళా అధికారి బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నట్లు చూపించే వీడియో ప్రసారం జరిగింది. ఈ ప్రసారంతో తెర వెనక బాగోతం బట్టబయలైందని ఉభయ విపక్షాలు బీజేడీ, కాంగ్రెస్ సహా రాష్ట్రంలోని పలు రాజకీయ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఉప ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండు
ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. అగ్నికి ఆహుతి అయిన బాధితురాలు బలహీన వర్గానికి చెందిన బాలిక. ఆమెను సజీవ దహనం చేశారని లెనిన్ మహంతి ఆరోపించారు. విపక్షం ఒత్తిడితో బాధిత బాలికను చికిత్స కోసం భువనేశ్వర్ నుండి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వరుసగా 3 సార్లు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇలా జరిగిందని నిలదీశారు. న్యాయమూర్తి సమక్షంలో ఎన్నిసార్లు వాంగ్మూలం నమోదు చేశారన్నారు. బాలిక మరణించిన 10 నిముషాల తర్వాత పోలీసులు మరణ సమాచారం ట్వీట్ చేశారు. మరో వైపు పోలీసులు అత్యంత నిజాయితీతో దర్యాప్తు నిర్వహించారని, వేరెవరి ప్రమేయం లేదని ట్విట్టర్‌లో ప్రసారం చేశారు. ఈ చోద్యం గతంలో ఎన్నడు చవి చూడలేదని వ్యాఖ్యానించారు. బాధితురాలు మరణించిన 15 రోజుల తర్వాత ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వీడియోలో న్యాయమూర్తి అక్కడ ఉన్నారో లేదో అనే అస్పష్టత సందిగ్ధత ఉందని లెనిన్ మహంతి పేర్కొన్నారు. దీనిపై ఆరా తీసి వీడియో దుమారంపై పోలీసులకు కచ్చితత్వం చాటుకోవాలన్నారు. దీనిపై రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వివరణ వెల్లడించాలని కోరుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ప్రసారం చేసిన వారిని గుర్తించిన మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది.
వీడియో ప్రామాణికత ఽధ్రువీకరిస్తాం: ఎస్పీ
ఆస్పత్రిలో బొలొంగా బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను ధ్రువీకరించన్నట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పినాక్ మిశ్రా ఆదివారం తెలిపారు. వీడియోను వైరల్ చేసిన వ్యక్తులపై దర్యాప్తు కోసం సైబర్ బృందం సహకారం తీసుకుని వీడియో క్లిప్ ప్రామాణికతను ధ్రువీకరిస్తామని మీడియాకు వివరించారు. ఈ ప్రసారం జువైనెల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 74 ఉల్లంఘనగా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. చట్టం ప్రకారం బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ విషయంలో బాధితురాలి కుటుంబం, బంధువులకు కూడా సమాచారం అందజేయడం జరిగిందన్నారు. మరికొన్ని ఫోరెన్సిక్ వైద్య నివేదికలు అందాల్సి ఉంది. దర్యాప్తు పూర్తి కావడంతో సమగ్ర సమాచారాన్ని కోర్టుకు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.