కనువిందుగా సీతారాముల కల్యాణ మహోత్సవం
జయపురం: స్థానిక జమాల్ లైన్‌లోని శ్రీరామ మందిరంలో చైత్రమాస శుద్ధ ఏకాదశి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వారణాశి సత్యనారాయణ దంపతులు, సుంకరి ఈశ్వరరావు దంపతులు సంయుక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. మరో ఎనిమిది మంది దంపతులు పాల్గొన్నారు. ముందుగా ముత్తైదువులు పసుపుదంచారు. ఆలయ అర్చకులు ఉలిమిరి నాగేశ్వరరావు, పట్టణ పురోహితులు గన్నవరపు కోటీ వరప్రసాద్‌లు సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని జరిపించగా.. భారీగా హాజరైన భక్తులు ఈ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించి తరించిపోయారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గోరపల్లి నాగరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జమాల్ లైన్ శ్రీరామ నవమి ఉత్సవాలకు వందేళ్ల చరిత్ర ఉందన్నారు. వందేళ్ల కిందట పట్టణంలో తెలుగు పెద్దలు శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణ మహోత్సవాలు ప్రారంభించారని.. ఆనాటి నుంచి ఏటా దీన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఉత్సవాలకు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని.. వారందరికీ శ్రీరామ మందిర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
కనువిందుగా సీతారాముల కల్యాణ మహోత్సవం
కనువిందుగా సీతారాముల కల్యాణ మహోత్సవం


