కొత్త ప్రధాన కార్యదర్శిగా అనూ గర్గ్
భువనేశ్వర్: అనూ గర్గ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాష్ట్రానికి తొలి మహిళా ప్రధాన కార్యదర్శి కానున్నారు. ఆమె ప్రస్తుతం ప్రముఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మనోజ్ అహుజా స్థానంలో నియమితులవుతారు. ఈ నెల 31న మనోజ్ ఆహుజా ఉద్యోగ విరామం పొందనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అనూ గర్గ్ ప్రస్తుతం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తు జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె జిల్లా పరిపాలన, ప్రజారోగ్యం, కార్మిక పాలన, నీటి నిర్వహణ మరియు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రెండింటిలోనూ ఉన్నత స్థాయి కీలక పదవుల్లో బాధ్యతలు విజయవంతంగా నిర్వహించి విశేష అనుభవం కలిగి ఉన్నారు.
లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన ఆమె సైకాలజీలో బంగారు పతకంతో మేటి విద్యార్థిగా తళుక్కుమన్నారు. ఆమె జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రజారోగ్య కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ముందు లక్నో విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని సాధించారు. అనూ గర్గ్ తన కెరీర్‌ను ఝార్సుగుడ, కలహండిలలో సబ్ డివిజనల్ స్థాయి అధికారిగా పాలనాధికారిగా జీవనం ప్రారంభించారు. అనంతరం బర్‌గఢ్, సంబల్‌పూర్‌లలో కలెక్టర్‌గా పని చేశారు. ఈ ప్రారంభ నియామకాలు ఆమెను జిల్లా పాలన, భూ నిర్వహణ, క్షేత్ర పరిపాలన సంక్లిష్టతలలో పాలన దక్షతకు పదును పెట్టాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో వరుసగా డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ, తర్వాత సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించారు.
2012, 2017 మధ్య ఆమె ప్రధాన మంత్రి కార్యాలయంలో ఒక ముఖ్యమైన బాధ్యతతో సహా కేంద్ర డిప్యుటేషన్‌లో పలు కీలకమైన బాధ్యతలతో పని చేశారు. జౌళి శాఖలో సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఒడిశాకు తిరిగి వచ్చిన ఆమె కార్మిక, ఈఎస్‌ఐలో సీనియర్ పదవులను నిర్వహించారు. తరువాత జల వనరుల శాఖలో ఇప్పటి వరకు బాధ్యతలతో కొనసాగారు.
2023లో అనూ గర్గ్ అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి (ప్లానింగ్ అండ్ కన్వర్జెన్స్)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదా, అధికారంతో ప్రధాన కార్యక్రమాలను పర్యవేక్షించడం, అంతర్ విభాగ ప్రణాళికను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు.


