
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్‌లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్‌ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్‌కు చేరుకుంది.
ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్‌ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు.
No more vacation…🫣| #ONLYinDADE
* Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025