
అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం జూలై 26న ఘనంగా జరిగింది. శివపదం రచయితసామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమానికి 900 మంది హాజరయ్యారు. ఈ శక్తి ఆ గీతాల్లో ఉందా, భారతీయ నృత్య రీతుల్లో భక్తి తత్త్వం ఉప్పొంగేలా అభినయించిన ఆ కళాకారుల్లో ఉందా అన్నంత సంశయాత్మక సమ్మోహనాన్ని కలిగించాయి దాదాపు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.
సామవేదం షణ్ముఖ శర్మ కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అయిదురోజులపాటు (జూలై 22-26) జ్ఞానయజ్ఞంగా నిర్వహించిన 'శివ మహిమామృతం 'ప్రవచనోత్సవాలకు పూర్ణాహుతి ఇదే అన్నంత నేత్రపర్వంగా ఆయన రచించిన శివపదాలను వివిధ భారతీయ నృత్య రీతుల్లో అమెరికాలోని కళాకారులు శివ విష్ణు దేవాలయ ప్రాంగణంలోని లకిరెడ్డి ఆడిటోరియంలో ప్రదర్శించారు.
మోహినీయాట్టంలో బాలా త్రిపుర సుందరి శక్తివర్ణన, కూచిపూడిలో నదీ రూపంతో - పరబ్రహ్మ స్వరూపమైన సాగరంలోకి - ఒంపుసొంపులతో సరస్వతి ప్రయాణం, మైసూర్ భరతనాట్యంలో శివకామ సుందరిగా అమ్మవారి మూర్తి-శక్తి వర్ణన, ఒడిస్సీలో 'వారాహీ రక్షతు మాం ' అంటూ వారాహి రూపంలో అమ్మవారి ఆరాధన, కథక్ లో కాళీమాత శక్తి స్వరూప పరమార్థం, మోహినీయాట్టం + భరతనాట్యంలో 'శ్రీగజలక్ష్మి చింతయామ్యహం ', భరతనాట్యంలో 'నీ కాలిగోటి రాకా సుధాంశువులు ' అంటూ అమ్మవారి శక్తివర్ణన, భరతనాట్యంలో 'అగజాధరమున నగవులవే, సిగపై వెన్నెల చిన్నబోయెరా..' అంటూ అమ్మవారి చిరునవ్వుల కాంతి వర్ణన .., ఇంకా శివ శివాని ఛిద్రస రూపా, పాయసాన్న ప్రదాత కాశీ అన్నపూర్ణ, ఆది పరాశక్తి తత్త్వం తదితర నృత్య రూపాల్లో ప్రతి ఒక్కటీ - నేపథ్యంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబు వంటి గాయకుల గాత్రంతో - ప్రేక్షకుల్ని భక్తి తన్మయుల్ని చేశాయి.
ముఖ్యంగా 'అమ్మా వాణి అక్షర వాణి...' అంటూ మనస్విని (రెండు రోజుల వ్యవధిలో సాధన చేసిన) అణువణువునా భక్తి భావన పలికించే అభినయంతో, ముద్రలతో, మెరుపు వేగంతో చేసిన నృత్యం ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేసిందంటే, ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో (Standingg Ovation) హర్షం వ్యక్తం చేశారు. "సరస్వతి దేవిని ఇక్కడ మనస్విని సాక్షాత్కరింపజేసింది " అని షణ్ముఖ శర్మ ప్రశంసించారు.ఒడిస్సి + భరతనాట్యంలో కళాకారుల బృందం 'శివుడు ధరించిన మాతృరూపమిది..' అంటూ నయనాందకరంగా ప్రదర్శించిన శివ-శక్తి రూపాల వర్ణన కూడా ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది.
మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మొంటానో భారతీయ నృత్య రీతులను ప్రశంసించారు. షణ్ముఖ శర్మ నిర్వాహకులకు మల్లాది రఘు బృందాన్ని, శివవిష్ణు ఆలయ కమిటీని అభినందించారు. ముఖ్యంగా వేయికి పైగా శివపదాల్లోంచి ఎంపిక చేసిన వాటికి వాణి గుండ్లాపల్లి 12 దేశాల్లో ఇలా భారతీయ నృత్య రీతుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తూండాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు పారిస్ నగరంలోకూడా వాణి ప్రదర్శన ఇవ్వబోతున్నారని ప్రకటించారు.