
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..
అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్‌ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్‌కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.
‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్‌బుక్‌లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు.
మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు.
ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది.