
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది.
ఎప్‌స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి.

ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది.

పామ్ బాండీ
‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్‌మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం.

ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే..
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.

కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.