మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతలు: సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా | CBSE Postpones March 2 Exams In Middle East | Sakshi
Sakshi News home page

మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతలు: సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

Mar 2 2026 11:33 AM | Updated on Mar 2 2026 11:59 AM

CBSE Postpones March 2 Exams In Middle East

న్యూఢిల్లీ: మిడిల్‌ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అస్థిరత,  తీవ్ర ఉద్రిక్తతల కారణంగా, విద్యార్థుల భద్రతను కాంక్షిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం( మార్చి 2)న జరగాల్సిన పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బోర్డు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి బోర్డు ప్రధాన కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది.

గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లలో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలన్నింటికీ ఈ వాయిదా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నామని, సోమవారం నాడు పరీక్షల నిర్వహణ సాధ్యం కానందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బోర్డు పేర్కొంది. వాయిదా పడిన సబ్జెక్టులకు సంబంధించిన తదుపరి పరీక్షా తేదీలను పరిస్థితులు కుదుటపడిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

మార్చి 5వ తేదీ నుండి జరగాల్సిన తదుపరి పరీక్షల నిర్వహణపై మార్చి 3వ తేదీన నిర్వహించే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లోని భారతీయ పాఠశాలల నుండి వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దని,  తమ నుంచి వచ్చే అధికారిక  సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: 91శాతం వైద్యుల షాకింగ్‌ డెసిషన్‌!

Advertisement
 
Advertisement
Advertisement