భారత్‌కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి | Air Suvidha 2 0: Center Issues New Guidelines For Foreign Travelers | Sakshi
Sakshi News home page

భారత్‌కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి

Jun 27 2026 7:31 PM | Updated on Jun 27 2026 7:50 PM

Air Suvidha 2 0: Center Issues New Guidelines For Foreign Travelers

ఢిల్లీ: భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్‌ సువిధ 2.0లో హెల్త్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 24 గంటల ముందే వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు 21 రోజుల ట్రావెల్‌ హిస్టరీ, ఆరోగ్య వివరాలు ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్‌ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (DIAL) భాగస్వామ్యంతో 'ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు ఈ కాంటాక్ట్‌లెస్ హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్ పోర్టల్‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఈ ఫామ్‌ను సమర్పించడం తప్పనిసరి.

ఫామ్‌ను ఇలా నింపండి..
భారతదేశానికి చేరుకోవడానికి ముందే ఈ ఎయిర్ సువిధ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. ఫామ్‌లో నమోదు చేసే వివరాలు మీ ఒరిజినల్ ప్రయాణ పత్రాలతో (పాస్‌పోర్ట్, టికెట్) సరిపోలాలి. విమానాశ్రయంలో వెరిఫికేషన్ కోసం అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

స్టెప్ 1: వ్యక్తిగత, ప్రయాణ వివరాలు
మీ పాస్‌పోర్ట్ వివరాలు, జాతీయత గత 21 రోజుల్లో మీరు ప్రయాణించిన దేశాల వివరాలను నమోదు చేయాలి. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించారా అనే విషయాన్ని పేర్కొనాలి. వీటితో పాటు మీ ఫ్లైట్ నంబర్, ఇండియాలో మీరు దిగే మొదటి విమానాశ్రయం పేరు, మరియు ట్రాన్సిట్ (కనెక్టింగ్) దేశాల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.

స్టెప్ 2: వివరాలు, వెరిఫికేషన్
భారతదేశంలోని మీ నివాస చిరునామా లేదా విదేశీ బస వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్/ఈమెయిల్‌కు వచ్చే OTP ద్వారా వివరాలను వెరిఫై చేయాలి.

స్టెప్ 3: ఆరోగ్య సమాచారం 
మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించినట్లు లేదా అక్కడ ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు డిక్లేర్ చేస్తే మాత్రమే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏవైనా లక్షణాలు ఉన్నాయా అనే హెల్త్ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.

స్టెప్ 4: రివ్యూ, సబ్మిట్
మీరు ఇచ్చిన వివరాలన్నీ చట్టబద్ధంగా సరైనవేనని నిర్ధారించుకుంటూ, మీ వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అంగీకరిస్తూ చెక్‌బాక్స్‌పై టిక్ చేయాలి. అనంతరం ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

ఫామ్‌ సబ్మిట్ చేసిన అనంతరం..
ఫామ్‌ విజయవంతంగా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. అలాగే మీ మెయిల్‌కు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ప్రయాణికులు ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌ను డిజిటల్ రూపంలో ప్రింట్ తీసుకుని విమానాశ్రయంలోని హెల్త్ డెస్క్ వద్ద చూపించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎయిర్‌పోర్ట్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్ మీకు అవసరమైతే అదనపు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement