
అమెరికాలో భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ తన దౌత్య సేవలను మరింత విస్తరించింది. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా కొత్తగా 8 ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా వెల్లడించారు.
ఎడిసన్, బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, ఓర్లాండో, రాలీ, శాన్ జోస్ వంటి నగరాల్లో ఈ నూతన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం ICACల సంఖ్య 17కి చేరినట్లు వివరించారు.
ఇక న్యూజెర్సీలోని ఎడిసన్‌లో జరిగిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్ హాజరై ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎడిసన్ మేయర్ సామ్ జోషితో పాటు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో VFS గ్లోబల్ నార్త్ అమెరికా, కరేబియన్ అధిపతి అమిత్ కుమార్ శర్మ పాల్గొని ప్రసంగించారు. VFS 150 దేశాలలో 70 ప్రభుత్వాలతో కలిసి పనిచేసిందన్నారు.
ఇక నూతన కేంద్రాల నుండి వర్చువల్‌గా చేరిన ప్రవాసులను ఉద్దేశించి వినయ్ ప్రసంగించారు. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు ద్వారా భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, సేవలు సులభతరం, వేగవంతమౌతాయని వినయ్ పేర్కొన్నారు. శనివారాల్లో కూడా ఈ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కేంద్రాల ఏర్పాటుతో- అమెరికా వ్యాప్తంగా నివసించే లక్షలాది మంది భారతీయులకు కాన్సులర్ సేవలు మరింత చేరువ చేసినట్టవుతుందని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ఈ కొత్త కాన్సులేట్లను తెరవడం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని.. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలమని అభిప్రాయపడ్డారు.
(చదవండి: డాలస్‌లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్)