డొంకేశ్వర్(ఆర్మూర్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక జూలై నెలాఖరు వరకు కరువు పరిస్థితే కనిపించింది. భూగర్భజలాలు తగ్గి, బోర్లు ఎత్తిపోయి, పంటలు ఎండుతున్న తరుణంలో ఆగస్టు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు ఊరిపిపోశాయి. ఆ తర్వాత కురిసిన వానలతో కూడా భూగర్భ జలాలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. జూలై ముగిసే నాటికి జిల్లాలో 12.93 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టాలు ఏకంగా 4.15 మీటర్లు మేర పైకి పెరిగి ప్రస్తుతం 8.78 మీటర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. దీంతో వట్టిపోయిన వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయ్యి నిండుగా పోస్తున్నాయి. పొలాలకు నీరందే మార్గం సుగమం కావడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆగస్టు మాసానికి సంబంధించిన భూగర్భ జలాలను ఫీజో మీటర్ల ద్వారా ఇటీవల లెక్కించారు. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్లు ఉండగా, 65 వాటిల్లో పుష్కలంగా నీటి మట్టాలు ఉన్నట్లుగా గుర్తించారు.
నిండిన చెరువులు
జిల్లా వ్యాప్తంగా 1,097 చెరువులు ఉండగా ఆగస్టు లో కురిసిన వర్షాలతో 70 శాతానికి పైగా చెరువులు పూర్తిగా నిండాయి.
ఆయా చోట్ల 19 చెరువులు ఇప్పటికీ అలుగు పారుతున్నాయి. దీంతో చెరువుల ఆయకట్టు కింద ఉన్న పంటలకు సాగునీటి ఇబ్బందులు తప్పాయని అన్నదాతలు ధీమాలో ఉన్నారు. మొత్తానికి తీవ్ర వర్షపాత లోటుతో ఉన్న జిల్లాకు ఆగస్టు నెల సంజీవనిలా పని చేసిందని చెప్పొచ్చు. వర్షాకాలంలో ఇప్పటి వరకు 65 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలోని చెరువుల్లో నీరు..
కురిసిన వర్షాలతో ౖపైపెకి
భూగర్భ జలాలు
జూలైతో పోలిస్తే 4.15 మీటర్ల మేర పెరిగిన జలమట్టం
జిల్లాలో నిండిన 70శాతం చెరువులు
నిండుగాపోస్తున్న వ్యవసాయ బోర్లు


