సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’(ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్ ద్వారా సకాలంలో యూరియా బుకింగ్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన సమయంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ద్వారా బుకింగ్‌కు నోచుకోక, అఽధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా తప్ప వేరే విధంగా యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే వరినాట్లు వేసి నెలరోజులు గడిచినా యూరియా దొరక్క ఎరువులు వేయలేదని, అదను దాటితే దిగుబడి వచ్చేది కష్టమేనని రైతులు చెబుతున్నారు.
అవసరానికి సరిపడా కనిపించని సరఫరా
జిల్లాలో యూరియాకు కొరత లేదని అధికారులు చెబుతున్నా.. పలుచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలావరకు మండలాల్లో సహకార కేంద్రాలు, డీలర్ల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో కొందరు డీలర్ల వద్ద అధికంగా నిల్వలు ఉండటం, అవసరమైన నిల్వకు మించి బుకింగ్ నమోదవుతోంది. మరికొందరు డీలర్లకు కేటాయించిన నిల్వకన్నా తక్కువ స్థాయిలో బుకింగ్ అవుతోంది. కొన్ని గ్రామాలు, భూముల వివరాలు యాప్‌లో కనిపించకపోవడంతో ఆయా గ్రామాల రైతులకు బుకింగ్‌కు అవకాశం ఉండటం లేదు.
సెకన్‌లలోనే నో స్టాక్..
ప్రభుత్వం తరచూ యూరియా యాప్‌లు మారుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గంటల తరబడి వేచి చూశాక యాప్ లో యూరియా బుకింగ్‌కు ప్రయత్నిస్తే క్షణాల్లోనే నో స్టాక్ చూపిస్తోంది. ఎన్నిసార్లు బుకింగ్ కోసం ప్రయత్నించినా యూరియా దొరకడం లేదు. అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలి.
– మిట్టాపల్లి మల్లారెడ్డి, రైతు, డొంకేశ్వర్
జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు జిల్లాకు 64,542 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించగా, రైతులకు 58,299 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ అయ్యింది. మరో 22,558 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒకచోట ఎక్కువ మరో చోట తక్కువ సరఫరాతో రైతులకు యూరియా అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో యూరియా నిల్వలకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి అన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రైతుల చేతికి 58,299 మెట్రిక్ టన్నులు
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ బుకింగ్‌తో
కొనసాగుతున్న తిప్పలు
కొరత లేదంటున్నా..
క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం
సాగుచేసి నెలరోజులైనా
యూరియా అందక రైతుల ఆందోళన


