డొంకేశ్వర్(ఆర్మూర్): అటవీ శాఖలో ఏ సంఘటన జరిగినా అధికారులు తప్పించుకోవడానికి కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులను చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెంజల్ మండలం నీలా శివారులోని బొగ్గుబట్టి ఘటనలో కూడా ఇదే జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైసెన్స్ రద్దయిన వ్యక్తికే మళ్లీ అనుమతు లు కట్టబెట్టిన అధికారుల్లో ఏ ఒక్కరిపై కనీస చర్యలు లేకపోవడం చూస్తే ‘సేఫ్‌గేమ్’ ఆడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ క్రమంలోనే పెద్దల చేతికి ‘మసి’ అంటకుండా సెక్షన్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకుని బలిపశువును చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5న సదరు బొగ్గుబట్టీపై అటవీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. బొగ్గు తయారీ కోసం అనుమతి లేని విలువైన అటవీ కలపను యథేచ్ఛగా వినియోగిస్తున్నట్లు గుర్తించి, సదరు వ్యాపారులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. హైదరాబాద్ నుంచి విజిలె న్స్ అధికారులు జిల్లాకు వచ్చి బొగ్గుబట్టీ ఘటనపై ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. సెక్షన్ ఆఫీసర్‌తోపాటు మరో ఇద్దరు పైస్థాయి అధికారుల పేర్లు కూడా నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. అనుమతి లేకుండా రెండు, మూడు చెట్లు నరికితేనే వేలల్లో జరిమానా విధిస్తుంటే.. కలపతో అక్రమంగా బొగ్గుబట్టీ నడుస్తున్నా రెండేళ్లుగా పట్టనట్లుగా ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు కానరాకపోవడం అటవీ శాఖలో చర్చ జరుగుతోంది.
ఉన్నతాధికారులదే నిర్ణయం
నిబంధనలకు విరుద్ధంగా నడిచిన బొగ్గుబట్టీ విషయంపై జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి విజిలెన్స్ విచారణ జరిగింది. రాష్ట్ర అధికారులకు నివేదిక చేరింది. ఇప్పటికే ఒక ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. ఇంకా ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలనే నిర్ణయం పైస్థాయి అధికారులే తీసుకుంటారు. – ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీఎఫ్‌వో
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌పై చర్యలు..
బొగ్గుబట్టి ఘటనలో పైస్థాయి
అధికారులపై కానరాని చర్యలు
తమను బలి చేస్తున్నారని కిందిస్థాయి ఉద్యోగుల ఆవేదన


