
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్‌అర్బన్: రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ 08462–220183కు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, అప్రమత్తంగా వ్యవహరించి, తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి