
గంగరాజు మళ్లీ సెల్‌టవర్ ఎక్కాడు
● తన ఇంటిముందు విద్యుత్‌స్తంభాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్
● గత నెల 19న టవరెక్కినా
పరిష్కారం కాని సమస్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు గంగరాజు అనే యువకుడు శనివారం మరోమారు సెల్‌టవర్ ఎక్కాడు. తన ఇంటిముందు విద్యుత్‌స్తంభం ఏర్పాటు చేసి వీధి దీపం అమర్చాలని డిమాండ్ చేస్తూ అతడు సెల్‌టవర ఎక్కాడు. కాగా గత నెల 19న ఇదే డిమాండ్‌తో ఆయన సెల్‌టవర్ ఎక్కడంతో స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్, ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం అతడు మరోమారు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సై భార్గవ్‌గౌడ్ అక్కడికి చేరుకొని గంగరాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడు వినిపించుకోకుండా ట్రాన్స్‌కో ఏఈ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు గ్రామానికి చేరుకొని గంగరాజు కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్తంభం ఏర్పాటుకు చర్యలు చేపట్టగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. సమస్య పరిష్కారం కోసం పక్కింటివారితో మాట్లాడుకోవాలని చెప్పారు. దీంతో గంగరాజు సెల్‌టవర్ దిగి కిందకువచ్చాడు. కాగా రెండు గంటలకుపైగా గంగరాజు సెల్‌టవర్‌పైనే ఉండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.