
‘మహాలక్ష్మి సాయం’ కోసం ఎదురుచూపులు!
ఆదేశాలు అందాల్సి ఉంది..
● మహిళలకు ప్రతినెల రూ.2500
అందిస్తామని కాంగ్రెస్ హామీ
● ప్రభుత్వం ఏర్పాటైనా ఇప్పటికీ
అందని సాయం
మోర్తాడ్(బాల్కొండ): సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా అర్హులైన గృహిణులకు మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలలో భాగంగానే ఈ పథకం అమలు చేస్తామన్నారు. కానీ నెలల గడుస్తున్నా అర్హులైన మహిళలకు ఆర్థిక సాయం అందడం లేదు. దీంతో వారు పథకం అమలు కోసం ఎదురుచూపులు చూడాల్సివస్తోంది.
జారీకాని మార్గదర్శకాలు..
ఆరు గ్యారెంటీల హామీల అమలు కోసం 2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,196 కోట్లను కేటాయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి కూడా బడ్జెట్‌లో నిధులను కేటాయించినా మార్గదర్శకాలను జారీ చేయకపోవడంతో మహిళలకు నిరాశనే ఎదురవుతుంది. ఇప్పటికే జిల్లాలో 74,154 మంది వితంతువులు, 10,185 మంది ఒంటరి మహిళలు, 95,453 మంది బీడీ కార్మికులకు ఆసరా ఫించన్‌లు అందుతున్నాయి. ఆసరా పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి మహాలక్ష్మి సాయం అందించే అవకాశం లేదు. ఈ సాయం కోసం అందించడానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తే జిల్లాలో సుమారు 50వేల మంది లబ్ధి పొందే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలనలో భాగంగా ఆసరా పింఛన్‌లను అందుకోని మహిళలు మహాలక్ష్మి సాయం కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తేనే ప్రతి నెలా సాయం అందుకునేవారి విషయంలో స్పష్టత రానుంది. దీంతెఓ ప్రభుత్వం ఎప్పుడు సాయం విషయంపై ప్రకటన చేస్తుందోనని మహిళలు నిరీక్షిస్తున్నారు.
మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రజాపాలనలో అనేక మంది దరఖాస్తులు అందించగా వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచాం. లబ్ధిదారులుగా ఎవరు అర్హులు, వారిని ఎలా గుర్తించాలి అనే విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాలేవు. తొందరలోనే మార్గదర్శకాలు జారీ కావచ్చు.
– తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్