
చికిత్స పొందుతూ ఒకరి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకుల ఆందోళన
నిజామాబాద్‌నాగారం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని మృతుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్(26) మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండేవాడు. అతడు శనివారం హైదరాబాద్ నుంచి ఆర్మూర్‌కు కారులో బయలుదేరగా, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రుడెన్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి ఆస్పత్రిలో మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందినట్లు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు, మెడికల్ రిప్రజంటేటివ్ సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు. వీరికి మద్ధతుగా సీఐటీయూ నాయకులు నూర్జహాన్, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు రషీదాభేగం, టీడీపీ అధికార ప్రతినిధి పురుషోత్తం, మెడికల్ రిప్రజంటేటివ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి