లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన జగడం భీమన్న(95) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో శనివారం మృతిచెందాడు. ఆయన మృతితో లక్ష్మణచాంద గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమన్నకు దేవుడు ఆవహిస్తాడని స్థానికులు విశ్వసిస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ కుటుంబాల్లో సమస్యలు ఎదురైనా, పశువులు తప్పిపోయినా ఆయన్ను సంప్రదించేవారు.
ప్రత్యేక ఆచారాలతో అంతిమయాత్ర
శనివారం అంత్యక్రియలను ప్రత్యేక సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక ఆచారాల ప్రకారం కర్రలతో ప్రత్యేకంగా జూలా ఏర్పాటు చేసి, అందులో భీమన్న పార్థివదేహాన్ని ఉంచి పూలతో అలంకరించి పూజలు చేశారు. పసుపు చల్లుతూ సంప్రదాయబద్ధంగా అంతిమ యాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మణచాంద గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.


