పదేళ్లు అద్దె ఇంట్లో..
ఇందిరమ్మ పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో గడిపిన మాకు కొత్తింట్లో పండుగలు జరుపుకుంటున్నాం. ఇప్పటికే బతుకమ్మ ఆడి సంబరాలు చేసుకున్నాం. తాజాగా దీపావళి వేడుకలు నిర్వహించాం. నూతన గృహంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పదేళ్ల అద్దె జీవితం తర్వాత సొంతింట్లో దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది. – ఎర్రోళ్ల గంగామణి,
ఖానాపూర్ మండలం, సుర్జాపూర్
సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి..
పదేళ్లుగా నా కూతురితో కలిసి ఇరుకు రేకుల గదిలోనే జీవించాను. వర్షాకాలం ఇంట్లోకి నీళ్లు వచ్చేవి. భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కనీసం ఇంటికి మరమ్మతులు కూడా చేయించుకోలేకపోయాను. ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో మా సొంతింటి కల నెరవేరింది. ఈసారి నా కూతురితో కలిసి సొంతింట్లో దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉంది. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి.
– కొడిపెల్లి రాధ, పెద్ద బెల్లాల్
సొంత ఇంట్లో దీపావళి
ఖానాపూర్: అద్దె ఇల్లు, గూనపెంకుల గూల్లు, రేకుల షెడ్లు, తాడిపత్రి కప్పిన పూరిళ్లు.. ఇలా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త భరోసా అందిస్తోంది. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. గతంలో అద్దె ఇళ్లలోనో, శిథిలావస్థకు చేరిన పూరిళ్లలోనో పండుగలు జరుపుకున్న కుటుంబాలు ఈసారి సొంత గూటిలో దీపావళి వేడుకలు నిర్వహించుకుని మురిసిపోయాయి. కొత్త ఇంటి ముంగిట దీపాలు వెలిగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడటంతో సొంతింట్లో తొలి పండుగ జరుపుకోవడం మరపురాని అనుభూతిగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.
జిల్లాలో పథకం పురోగతి..
జిల్లాలో మొత్తం 10,314 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 8,288 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయింది. వీటిలో 3,584 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 19 మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకం అమలవుతోంది. ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని (ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్) మొత్తం 599, నిర్మల్ నియోజకవర్గం 1498, ముథోల్ నియోజకవర్గం 1487, కుటుంబాలకు సొంతింటి భాగ్యం కలిగింది.
సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
బాసర: పేదలందరికీ సొంతింటి కలను సాకా రం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. బాసర మండలం లాబ్ధి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయినర్సింగ్ దంపతుల నూతన గృహంలో కలెక్టర్ దీపావళి జరుపుకున్నారు. పిల్లలకు మిఠాయిలు, టపాసులు, నోటుపుస్తకాలు అందజేసి చక్కగా చదువుకోవాలని సూచించారు. లాబ్ధి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజలో ఉందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతికి కృషి చేసిన అధికా రులు, ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. లబ్ధిదారు అనూష బాయి మాట్లాడుతూ.. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, నిర్మించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ స్వయంగా తమ ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.


