కాపాడుకుంటేనే తాగునీరు! | - | Sakshi
Sakshi News home page

కాపాడుకుంటేనే తాగునీరు!

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

ఎల్‌నినో ప్రభావంతో 24 శాతం తక్కువ వర్షపాతం కడెం మినహా పూర్తిస్థాయిలో నిండని ప్రాజెక్టులు తగ్గుతున్న జలమట్టాలు.. ప్రధాన చెరువుల్లోనూ అంతంతే ట్రిపుల్‌ ఐటీలో నీటి ఎద్దడితో అప్రమత్తమైన ప్రభుత్వం భైంసా, నిర్మల్‌ పట్టణాలకు గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులే ఆధారం

‘గడ్డెన్న’ వెలవెల

భైంసా: ఎల్‌నినో ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. 24 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జలాశయాలు నిండలేదు. ఉన్న నీటిమట్టాలు కూడా వేగంగా తగ్గుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు వట్టిపోతున్నాయి. ఖరీఫ్‌ పంటలే అక్కడక్కడా ఎండుతున్నాయి. దీంతో రాబోయే వేసవిలో తాగునీటి అవసరాలపై ఆందోళన నెలకొంది. కడెం మినహా మిగతా జలాశయాలు, చిన్న–మధ్యతరహా ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల్లో నీరు సరిపడా లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఆరు నెలల నీటి నిర్వహణ కీలకం.

తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం..

ఉత్తరతెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రా జెక్టు. ఇది కూడా ఈసారి నిండలేదు. జిల్లా తాగునీటికి ప్రధాన ఆధారం ఈ జలాశయమే. అక్టోబ రు 29 ఉదయం 6 గంటల నాటికి నీటిమట్టం 35. 777 టీఎంసీలు మాత్రమే. గతేడాది ఇదే సమయంలో 80.501 టీఎంసీలు ఉండగా ఇప్పుడు అందులో సగం కూడా లేవు. ఇన్‌ఫ్లో రావడం లే దు. ఔట్‌ఫ్లో సగటు 1,535 క్యూసెక్కులుగా ఉంది.

ట్రిపుల్‌ ఐటీలో సంక్షోభం..

గత వారం బాసర రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో నీటి కొరత తీవ్రమైంది. సుమారు 9 వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌లో సరఫరా సరిపోక సెలవులు, ఆన్‌లైన్‌ తరగతులు ప్రకటించారు. కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా నేతృత్వంలో సమీక్ష చేసి సమస్య పరిష్కరించి తరగతులు పునఃప్రారంభించారు. ఇది వేసవి నిర్వహణ ఎంత ముఖ్యమో చూపిస్తోంది.

ఖానాపూర్‌, పట్టణాల్లో ఇబ్బందులు

ఖానాపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఇబ్బందులు మొదలయ్యాయి. భైంసా సమీప గడ్డెన్నవాగు, సారంగాపూర్‌ స్వర్ణ ప్రాజెక్టులు భైంసా, నిర్మల్‌ పట్టణాలకు కీలకం. వర్షాభావంతో వీటిలోనూ లభ్యత తగ్గింది. పట్టణాలు, గ్రామాల్లో స్థానిక వనరులు, సరఫరా వ్యవస్థల సామర్థ్యం, రోజువారీ అవసరాలను ముందస్తుగా సమీక్షించాలి. ఇక ప్రధాన చెరువులు పూర్తిగా నిండకపోవడంతో స్థానిక వనరులపై ఆధారపడే గ్రామాలకు వేసవిలో ఇబ్బందులు రావచ్చు. భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఆరుతడి పంటలు, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి.

ఆరు నెలల ప్రణాళిక అవసరం

గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల వారీగా రోజువారీ అవసరాలు లెక్కించి గడ్డెన్నవాగు, స్వర్ణ, కడెం, ఎస్సారెస్పీ తదితర నిల్వలను సమీక్షించాలి. తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చి సాగునీటి కేటాయింపు నిర్ణయించాలి. బాసర వంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థలకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రత్యామ్నాయ వనరులు గుర్తించి, చెరువుల నిల్వలు కాపాడి, వృథా నివారించాలి.

భైంసాటౌన్‌: ఏటా వర్షాకాలంలో నిండుకుండలా మారే గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రస్తుతం వెలవెలబోతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. దీంతో పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 357 మీటర్ల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకేశ్వరం మండలాల్లో 9 వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు సాగునీరందించేవారు. ఈసారి సాగు నీరందించలేదు. ప్రస్తుతం తాగునీరు అందించేందుకే పరిమితమైంది.

రోజుకు 20 క్యూసెక్కులు...

పట్టణంలోని మిర్జాపూర్‌ మార్గంలో నిర్మించిన గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి భైంసా డివిజన్‌లోని దాదాపు 250 గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టు సమీపంలో మిర్జాపూర్‌ మార్గంలో నిర్మించిన మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా పట్టణంతోపాటు బాసర మండలం మినహా డివిజన్‌లోని అన్ని మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఇందుకు రోజుకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. వాటిని శుద్ధిచేసి 45 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం సగం నీరే ఉంది. వచ్చే జూన్‌ వరకు తాగునీటికి ఇబ్బంది ఉండదని మిషన్‌ భగీరథ అధికారులు చెబుతున్నారు.

లీకేజీలతో వృథా..

గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద గేట్ల నుంచి ప్రతీరోజు నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్టుకు మొత్తం ఎనిమి ది గేట్లు ఉండగా, రెండో గేటు వద్ద లీకేజీ భారీగానే ఉంటోంది. ప్రాజెక్టు నిర్వహణను సంబంధిత అధి కారులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు పరిసరా లు కళావిహీనంగా మారాయి. ప్రస్తుత ఎల్‌నినో పరి స్థితుల్లో లీకేజీలను అరికట్టాల్సిన అవసరముంది.

సాగునీరు కష్టమే..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులోకి వరద చేరలేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో సగం వరకే నీరు నిల్వ ఉంది. ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఒక టీఎంసీ వరకు నీటిని సాగునీటికి వినియోగించేది. ఈసారి సాగు అవసరాలకు నీటి విడుదల సాధ్యం కాదు. మిష న్‌ భగీరథ పథకం కింద ప్రాజెక్టు నుంచి రోజుకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నా రు. మరో పది క్యూసెక్కులు లీకేజీలు, ఆవి రి రూపంలో పోతోంది. – అనిల్‌కుమార్‌,

డీఈఈ, గడ్డెన్నవాగు ప్రాజెక్టు

తాగునీటికి ఢోకా లేదు..

పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు నీరు వినియోగిస్తున్నాం. భైంసా డివిజన్‌ పరిధిలోని 250 గ్రామాలకు రోజుకు 45 ఎంఎల్‌డీల నీరు సరఫరా చేస్తున్నాం. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ ప్రకారం జూన్‌ వరకు నీటి సరఫరాకు ఇబ్బంది లేదు.

– ధర్మేందర్‌, డీఈఈ, మిషన్‌ భగీరథ డబ్ల్యూటీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement