ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ, అమృత్–2, బోర్లు, బావుల ద్వారా సరఫరా జరుగుతున్నా సుభాష్‌నగర్, గాంధీనగర్, శివాజీనగర్, శాంతినగర్, శ్రీరామ్‌నగర్‌లో నీటి ఎద్దడి మొదలైంది. వేసవికి ముందే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలు, వృథా నీరు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. 12 వార్డుల్లో సుమారు 25,600 మంది, 7,267 కుటుంబాలు ఉన్నాయి. 6,576 కుటుంబాలకు భగీరథ కుళాయిలు, అమృత్–2 కింద 704 కుళాయిలు ఉన్నాయి. రోజుకు 2.34 ఎంఎల్‌డీ అవసరమైనా కొన్ని ప్రాంతాలకు సరిపడా నీరు అందడం లేదు.
సరఫరా ఇలా..
కడెం నుంచి భగీరథ ద్వారా నీరు వస్తోంది. 1,175 కిలోలీటర్ల సామర్థ్యం గల ఎనిమిది ట్యాంకుల నుంచి ఉదయం 6–8, సాయంత్రం 5–6 గంటలకు విడుదలవుతోంది. అయినా పైపులైన్ లీకేజీలు, ఒత్తిడి తేడాలు, పంపిణీ లోపాలు ఉన్నాయి.
అమృత్–2 పనులు ఆలస్యం..
రూ.22 కోట్లతో 45 కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. 1,300, 500 కిలోలీటర్ల రెండు కొత్త ట్యాంకుల నిర్మాణం కొనసాగుతోంది. పూర్తయితే నిల్వ, పంపిణీ మెరుగవుతాయి. జాప్యంతో ప్రయోజనం ఆలస్యమవుతోంది.
అదనపు వనరులు..
రెండు ఓపెన్ వెల్స్, 96 పవర్ బోర్లు, 52 చేతిపంపులు ఉన్నాయి. నిరుపయోగ బావులను పునరుద్ధరించాలి. లీకేజీలు అరికట్టి, చివరి ప్రాంతాలకు తగిన ఒత్తిడితో నీరు చేరేలా చూడాలి. ప్రతి వార్డు సరఫరాను సమీక్షించి సమస్యాత్మక ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
ఖానాపూర్ పట్టణంలో తాగునీటి సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అమృత్ – 2 పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. పనులను త్వరగా పూర్తిచేయకపోతే తగిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా నీటి లీకేజీలు, నీటి వృథా ఉన్నా ప్రజలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం. – సుందర్‌సింగ్, మున్సిపల్ కమిషనర్


