చేయూత ఎప్పుడో! | - | Sakshi
Sakshi News home page

చేయూత ఎప్పుడో!

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

వడపోత పూర్తయినా తప్పని ఎదురుచూపులు పండుగల ముందు ఊరించి.. తర్వాత ఉసూరుమనిపించి.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

నిర్మల్‌చైన్‌గేట్‌: చేయూత పింఛన్ల కోసం జిల్లా దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. వేలాది మంది పేదలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వా త కొత్త పింఛన్లు మంజూరు చేయడంతోపాటు ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత లేకపోవడంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌ 2, ఆగస్టు 15, దసరా పండుగ వంటి సందర్భాల్లో పింఛన్లు వస్తాయని ఆశపడి నిరాశ చెందడం లబ్ధిదారులకు పరిపాటైంది.

హామీలు ఘనం.. అమలు శూన్యం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, ఇతర పింఛన్లను కూడా పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు పింఛన్లు అందుతాయని అర్హులు ఆశించారు. ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం ద్వారా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అయితే వాటి మంజూరుపై దృష్టి పెట్టలేదు. దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ దరఖాస్తుల స్థితి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెలలు గడిచినా పింఛన్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడు రకాల పింఛన్లు..

ప్రభుత్వం ఏడు రకాల పింఛన్లకు అవకాశం కల్పిస్తూ ఒంటరి మహిళలు, వితంతువులు, గీతకార్మికులు, నేతకార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్‌ రోగులు(కిడ్నీ ఫెయిల్యూర్‌), దివ్యాంగులు (తలసేమియా, సికిల్‌ సెల్‌, హీమోఫీలియా బాధితులు) దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించింది. ముందుగా ఆగస్టు 30లోగా దరఖాస్తులు సమర్పించాలని గడువు విధించింది. క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు సమయం కావాలని అభ్యర్థనలు రావడంతో సెప్టెంబరు 15 వరకు గడువు పొడిగించింది. జిల్లావ్యాప్తంగా 11,384 దరఖాస్తులు వచ్చాయి. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం 10,119 మంది అర్హులు ఉన్నట్లు తేలింది.

వృద్ధులు, బీడీ కార్మికులకు తప్పని నిరీక్షణ..

జిల్లాలో అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులు ఉన్నా చేయూత పింఛన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. పీఎఫ్‌ సౌకర్యం ఉన్నా బీడీలు చేసే కార్మికులు కొత్తగా పింఛన్లు కావాలని కోరుతున్నారు. వృద్ధులు కూడా సామాజిక పింఛన్లకు ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులకు మంజూరు కాకపోవడంతో దీపావళి పండుగ నాటికై నా శుభవార్త వస్తుందని భావిస్తున్నారు.

ప్రతీసారి నిరాశే..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న కొత్త పింఛన్లు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 15న కచ్చితంగా ఇస్తారన్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురించాయి. జూన్‌ 2, స్వాతంత్య్ర దినోత్సవం గడిచినా పింఛన్లు మంజూరు కాలేదు. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి మండలాల వారీగా అర్హతలు పరిశీలించారు. దీంతో కనీసం దసరా నాటికై నా పింఛన్లు అందుతాయని దరఖాస్తుదారులు భావించారు. కానీ అది కూడా నిరాశే మిగిల్చింది.

కొత్తగా వచ్చిన దరఖాస్తులు 11,384

వెరిఫికేషన్‌ తర్వాత అర్హులు 10,265

అనర్హులు 632

హోల్డ్‌లో ఉంచినవి 450

పెండింగ్‌లో ఉన్నవి 47

జిల్లాలో ప్రస్తుత పింఛన్లు ఇలా..

మొత్తం 1,44,773

బీడీ కార్మికులు 61,933

వృద్ధాప్య 33,890

వితంతు 35,664

దివ్యాంగ 9,822

ఒంటరి మహిళ 2,093

గీత కార్మికులు 266

ఫైలేరియా 221

డయాలసిస్‌ 110

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement