నిర్మల్‌టౌన్: ఎల్‌నినోతో ఈ ఏడాది జిల్లాలో వర్షాలు తక్కువగా కురిశాయి. ఈ క్రమంలో నిర్మల్ మున్సిపాలిటీ నీటి పొదుపుపై దృష్టి పెట్టింది. వృథాను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది. నీటి వృథాను అరికట్టడం ప్రజలు బాధ్యతగా భావించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు సూచించారు. పట్టణ పరిధిలో ఎక్కడైనా పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మున్సిపల్ ఇంజినీర్ నంబర్‌కు 8179376375 సమాచారం అందించాలని తెలిపారు. ప్రతీ గృహ వినియోగదారుడు తమ నీటి కనెక్షన్లకు తప్పనిసరిగా ట్యాప్‌లు బిగించుకోవాలని సూచించారు. నీరు వథా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే గృహ వినియోగదారులు ప్రైవేట్ లేదా అనధికార మోటార్ల ద్వారా మున్సిపల్ నీటిని వినియోగించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడితే జప్తు చేస్తామని హెచ్చరించారు. నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానా విధించడంతోపాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.


