జన గణనకు సమాయత్తం | - | Sakshi
Sakshi News home page

జన గణనకు సమాయత్తం

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

● సిద్ధమవుతున్న యంత్రాంగం ● 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ ● ఒక్కో మండలాన్ని ఒక్కో చార్జ్‌గా విభజన

● చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు శిక్షణ

నిర్మల్‌చైన్‌గేట్‌: జనగణనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇళ్ల గణన(హౌస్‌లిస్టింగ్‌ ఆపరేషన్‌) విజయవంతంగా పూర్తయింది. 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న జనగణనకు ముందస్తు ప్రణాళిక రూపకల్పన ప్రారంభమైంది.

శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం

వారం రోజుల క్రితం చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈనెల 16, 17 తేదీల్లో వారికి శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐలు, డీటీలు, సీనియర్‌ అసిస్టెంట్లు చార్జ్‌ క్లర్కులుగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, సమానస్థాయి అధికారులు బాధ్యతలు నిర్వహిస్తారు. టెక్నికల్‌ అసిస్టెంట్ల సహాయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా బ్లాకులను గుర్తిస్తున్నారు.

ఎన్యుమరేషన్‌ బ్లాకుల ఏర్పాటు

మొదటి విడత హౌస్‌లిస్టింగ్‌ తరహాలోనే జనగణనకు 750 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేషన్‌ బ్లాకుగా గుర్తిస్తున్నారు. ఇళ్ల గణనలో వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ బ్లాకులను నిర్ణయిస్తున్నారు. ఎన్యుమరేటర్‌కు పనిభారం తగ్గేలా ఈ పరిమితిని పాటిస్తున్నారు.

21 చార్జ్‌లుగా విభజన

జిల్లా వ్యాప్తంగా 21 చార్జ్‌లు ఉంటాయి. ప్రతీ మండలాన్ని ఒక రూరల్‌ చార్జ్‌గా, మున్సిపాలిటీలను అర్బన్‌ చార్జ్‌గా పరిగణిస్తారు. జిల్లాలో 18 మండలాలు, మూడు మున్సిపాలిటీలు ఉండటంతో ఈ విభజన సాధ్యమవుతుంది. ఈ చార్జ్‌ల్లో రెండు వేలకు పైగా బ్లాకులు ఉంటాయి. హౌస్‌లిస్టింగ్‌ సమయంలోనే అధికారులు ఇలాగే బ్లాకులను గుర్తించి ఇళ్ల లెక్కింపు చేపట్టారు.

ఉన్నతాధికారులకు శిక్షణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ జనగణనలో పొరపాట్లు జరగకుండా పక్కా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తోపాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలకు కూడా తర్ఫీదు ఇవ్వనున్నారు.

వివరాలు..

మునుపటి ఈబీలు 1566

ప్రస్తుత ఈబీలు 1705

ఎన్యుమరేటర్లు 1462

సూపర్‌ వైజర్లు 247

మునుపటి ఎన్యుమరేటర్లు 1386

మునుపటి సూపర్‌ వైజర్లు 239

చార్జ్‌ క్లార్క్‌, టెక్నికల్‌ అసిస్టెన్స్‌ శిక్షణ తరగతులు 16, 17 తేదీల్లో

చార్జ్‌ ఆఫీసర్‌ శిక్షణ తరగతులు 27, 28 తేదీల్లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement