
వారణాసి: ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత బాబా శివానంద్ ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 128 ఏళ్లని శిష్యులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను ఏప్రిల్ 30న బీహెచ్‌యూ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేసినట్టు శిష్యులు తెలిపారు. 1896 ఆగస్ట్ 8న నేటి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో జన్మించిన బాబా శివానంద్ ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు.
అనంతరం గురువు ఓంకార్‌నాథ్ సంరక్షణ, మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక శిక్షణ పొందారు. అప్పట్నుంచే ఒంటిపూట భోజనం వంటి కఠిన నియమాలను పాటిస్తూ వచ్చారు. నిత్యం తెల్లవారుజామున మూడింటికే మేల్కొని యోగసాధన చేసేవారు. ఆధ్యాతి్మక, యోగసంబంధ అంశాల్లో సేవలకు కేంద్ర ప్రభుత్వం 2022లో ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది. బాబా లేని లోటు పూడ్చలేదంటూ ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.