
క్లినికల్ సైకాలజిస్ట్‌పై అత్యాచారానికి పాల్పడిన విద్యార్థి
కౌన్సిలింగ్ తీసుకుంటానని నమ్మించి హాస్టల్‌కు రప్పించిన వైనం
మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారం
బాధితురాలి ఫిర్యాదుతో విద్యారి్థని అరెస్టు చేసిన పోలీసులు
కోల్‌కతా: ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కలకత్తా క్యాంపస్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళపై విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన పానీయం తాగించాడని, తాను అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడు మహావీర్ తొప్పాన్నవర్ అలియాస్ పరమానంద జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం నగరంలోని అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన అతడిని మళ్లీ తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోరగా మేజిస్ట్రేట్ తిరస్కరించారు.
ఆన్‌లైన్ ద్వారా సంప్రదింపులు
కోల్‌కతాకు చెందిన మహిళ క్లినికల్ సైకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. విద్యార్థులకు, యువతకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఐఐఎం క్యాంపస్‌లో చదువుకుంటున్న విద్యార్థి కౌన్సిలింగ్ తీసుకుంటానని ఆన్‌లైన్ ద్వారా ఆమెను సంప్రదించాడు. శుక్రవారం సదరు మహిళను తమ హాస్టల్‌కు రప్పించాడు. హాస్టల్ గదికి చేరుకున్న తర్వాత ఆమెకు డ్రగ్స్ కలిపిన పానీయం అందజేశాడు. అది సేవించి ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.
అతడిని గట్టిగా నిలదీయడంలో బెదిరింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘోరాన్ని వివరించారు. పోలీసులు రంగంలోకి దిగి, శుక్రవారం రాత్రి నిందితుడు పరమానంద జైన్‌ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఐఐఎం–కలకత్తా యాజమాన్యం స్పందించింది. తమ విద్యార్థిపై ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని వెల్లడించింది. ఆమె తమ సంస్థకు చెందిన మహిళ కాదని స్పష్టంచేసింది.
కోల్‌కతాలో వరుస ఘటనలు
పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే 15 రోజుల క్రితం కోల్‌కతాలోని న్యాయ కళాశాలలో 24 ఏళ్ల విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆమెను రేప్ చేసినట్లు కేసు నమోదైంది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అత్యాచారం జరగలేదు.. ఆటో నుంచి కింద పడిపోయింది
ఐఐఎం–కలకత్తా క్యాంపస్ హాస్టల్‌లో అత్యాచారానికి గురైన మహిళ తండ్రి భిన్నంగా స్పందించారు. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆటోలో ప్రయాణిస్తూ కింద పడిపోవడంతో స్వల్పంగా గాయాల పాలైందని శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 9.34 గంటల సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, తన బిడ్డ ఆటో నుంచి పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరినట్లు తెలిసిందని అన్నారు. పోలీసులు అమెను ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. రేప్ జరగలేదని తన కుమార్తె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించారు.