2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే.. | Will TMC NCP merge back into Congress | Sakshi
Sakshi News home page

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

Jun 20 2026 9:32 PM | Updated on Jun 21 2026 11:05 AM

Will TMC NCP merge back into Congress

ఒకప్పుడు కాంగ్రెస్‌కు దాదాపు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రాజకీయంగా బలహీనపడుతున్నాయి. బీజేపీ వేగంగా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ.. ప్రతిపక్ష ఐక్యత మరోసారి ప్రధాన చర్చగా మారింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో మరింత దగ్గరయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్‌లో ఆయా పార్టీల విలీనం జరుగుతుందా? లేక సీట్ల సర్దుబాటుతోనే కలిసి ముందుకెళ్తారా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు, కాంగ్రెస్‌తో వాటి సంబంధాలు, ప్రతిపక్ష రాజకీయాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన "ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసే అవకాశం ఉంది" అనే వ్యాఖ్య ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు, సీట్ల సర‍‍్దుబాటు వంటి అనేక అంశాలు కాంగ్రెస్‌కు తలనొప్పి తెచ్చిపెట్టేవి. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనపడుతోంది. విలీనం అయినా కాకపోయినా, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌తో మరింత సన్నిహిత సంబంధం ఏర్పడటం, నియోజకవర్గాల వారీగా సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం మరింత సులభం కావచ్చు.

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారు? 
ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్‌ పవార్‌ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో మహారాష్ట్రలోని సాతారాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు. మరో రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో మరింత సన్నిహితంగా కలిసిపోతాయని అన్నారు. లేదంటే కాంగ్రెస్‌లో విలీనం అయ్యే మార్గాన్ని పరిశీలిస్తాయని ఆయన అన్నారు. ఆయన సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) గురించి మాట‍్లాడుతూ.. తన పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదని  చెప్పారు.

పవార్ గురించి చాలా మందికి తెలుసు. ఆయన ఆలోచించకుండా మాట్లాడరు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ లోతైన అర్థం ఉంటుంది. సరైన సమయంలోనే మాట్లాడతారు. ఆ సమయంలో కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే పవార్‌ అలా మాట్లాడి ఉండొచ్చని విశ్లేషకులు చెప్పారు.

ఏడాది క్రితమే ఎన్‌సీపీ చీలిపోయింది. చాలా మంది నేతలు శరద్‌ పవార్‌ తన మేనల్లుడు అజిత్ పవార్ వైపు వెళ్లారు. రాష్ట్ర ఎన్నికల వేళ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, అలాగే జాతీయ స్థాయిలో పెద్ద పాత్ర పోషించే అవకాశాన్ని పరిశీలించాలని సీనియర్ పవార్ భావించి ఉండవచ్చు. ఆ తర్వాత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 స్థానాలు దక్కాయి. 

శరద్‌ పవార్‌తో పాటు ఆయన ద్వారా ఇతర ప్రాంతీయ నాయకులను సంప్రదించి మరింత సమన్వయం పెంచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఆ తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయాల వల్ల బీజేపీకి మళ్లీ బలం లభించింది.

ఆ అంచనాకు మళ్లీ ప్రాధాన్యం 
సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు పవార్ చెప్పిన అంచనాకు మళ్లీ ప్రాధాన్యం లభిస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి. బీజేపీ వేగంగా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను ప్రోత్సహిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో తిరుగులేని నాయకురాలిగా ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన మమతా బెనర్జీ ఇప్పుడు ఓటమి పాలయ్యారు. ఆమె పార్టీ వేగంగా ముక్కలవుతోంది. ఆమె ఎమ్మెల్యేలలో, లోక్‌సభ సభ్యుల్లో దాదాపు 2/3 మంది ఆమెను వీడిపోయారు. రెబల్స్‌ ఎన్‌సీపీఐ అనే చిన్న పార్టీలో విలీనమై, ఇప్పుడు తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.

ఇటు మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) మరో చీలిక ఊహాగానాలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ జూన్ 8న రెండేళ్ల తర్వాత ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఈ కూటమిపై ఆసక్తి చూపని మమతా బెనర్జీ.. ఈ సారి మాత్రం సోనియా గాంధీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఆ వెంటనే మమ, పవార్ తమ బలహీనపడిన పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయవచ్చనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఆ వార్తలను ఖండించినా మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న వారందరూ "ఘర్ వాపసీ" చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రాంతీయ పార్టీలు నిజంగా కాంగ్రెస్‌లో విలీనం అవుతాయా? లేక తమ ప్రత్యేక గుర్తింపును కాపాడుకుంటూనే చేతులు కలుపుతాయా? అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో ప్రతిపక్షం మనుగడ కోసం కొత్త వ్యూహాలు తప్పనిసరి అవుతున్నాయి. శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావడం కూడా అదే సంకేతాన్ని ఇస్తోంది. రానున్న రోజుల్లో విలీనాలు జరుగుతాయా, లేక సీట్ల పొత్తులతోనే ప్రతిపక్షం కొత్త రూపం దాల్చుతుందా అన్నది భారత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement