
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. సింగిల్ స్టేటస్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంచిన ఆమెను, తన ప్రేమను ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేయడం గమనార్హం.
అనుష్క యాదవ్(Anushka Yadav) అనే అమ్మాయితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని, తాము గతకొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక ఇలా పోస్ట్ ద్వారా తెలియజేశానని, అంతా తనను అర్థం చేసుకుంటారని వెల్లడించారాయన. ఈ పోస్ట్ బీహార్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొందరు తేజ్ ప్రతాప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరికొందరు వివాహం ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అనుష్క యాదవ్ నేపథ్యం కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న ఈ యువనేత.. తాను అక్కడ సింగిల్‌గా లేననే విషయాన్ని తాజా పోస్టుతో స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్-రబ్రీదేవి జంటకు తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కూతుళ్ల తర్వాత ఏడో సంతానంగా తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించాడు. చిన్న కొడుకు, మాజీ మంత్రి తేజస్వి యాదవ్ చివరి సంతానం. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు గతంలో వివాహం జరిగింది.

బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య(Tej Pratap Yadav Wife Aishwarya)తో 2018లో తేజ్ ప్రతాప్ వివాహం అయ్యింది. అయితే ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. తనను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని తేజ్ ప్రతాప్, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఐశ్వర్య ఐదు నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తుండగా.. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.