వీధి కుక్కల నియంత్రణ అంశంలో పలు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తీవ్ర నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అది ఎలా ఉందో తెలియజేసే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి వచ్చిన అధికారుల వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడంపై ఆయన వాళ్లపై మండిపడ్డారు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళవారం బెంగళూరులో కర్ణాటక మంత్రి రాష్ట్ర మంత్రి కృష్ణ బైరెగౌడ నేతృత్వంలో వీధికుక్కల నియంత్రణం అంశంపై సమీక్ష సమావేశం జరింది. దీనికి పశుసంవర్ధక శాఖకు చెందిన 19 మంది అధికారులు పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్ల ఖర్చు, ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు, ప్రస్తుతం వీధికుక్కల సంఖ్య ఎంత వంటి ప్రాథమిక వివరాలు కూడా వారి వద్ద లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మీరు సమావేశానికి ఎందుకు వచ్చారు? కనీస డేటా కూడా లేకుండా ఎలా వచ్చారు? అదంతా ప్రజల డబ్బు కదా? ఎక్కడికి పోయింది? అలా ఎలా ఖర్చు పెట్టారు?" అంటూ కాస్త కఠినంగానే అధికారులను ప్రశ్నించారు. ఐదేళ్ల వ్యయ వివరాలు వెంటనే ఇవ్వాలని, డేటా లేకుండా సమావేశానికి రావడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఈ క్రమంలో అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆ ఇచ్చిన సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో మంత్రి మరింత అసహనం వ్యక్తం చేశారు. "నేను చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు.. మీరు చెప్పిందల్లా వినడానికి" అంటూ కన్నడలోని ఒక సామెతను ఉపయోగిస్తూ.. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. వీధికుక్కల సంఖ్య యథాతథంగా ఉండటంపై ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.
Bengaluru Development Minister @krishnabgowda on Tuesday pulled up Animal Husbandry Department officials during a review meeting over the stray dog sterilisation programme. Questioning how stray dog population had remained unchanged despite sterilisation being carried out for… https://t.co/a3bPBWvJcI pic.twitter.com/b3HQPZ5Ls9
— ChristinMathewPhilip (@ChristinMP_) June 30, 2026
ఈ సందర్భంగా సంబంధిత అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని సమావేశంలోనే ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, స్టెరిలైజేషన్‌ల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణ బైరెగౌడ కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుకుని, అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న కృష్ణ బైరెగౌడ.. ప్రస్తుతం బెంగళూరు అభివృద్ధి శాఖ (Bengaluru Development) మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనంపై రాజీ పడని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కృష్ణ బైరెగౌడ అధికారుల పనితీరుపై కఠిన వైఖరికి పేరుగాంచారు. ఇటీవల కూడా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులను గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్టర్‌కు జరిమానా విధించారు. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు.
సుప్రీంకోర్టు కూడా సీరియస్..
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై భారత సుప్రీంకోర్టు కూడా పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జంతు సంక్షేమ నిబంధనలను కూడా పాటించాలని స్పష్టం చేసింది. కేవలం స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం కాకుండా.. వాటి ఫలితాలు ప్రజలకు కనిపించేలా ఉండాలని కోర్టు పరోక్షంగా సూచించింది. ఈ నేపథ్యంలో.. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై కర్ణాటక మంత్రి కృష్ణ బైరెగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


