పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా..
ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్‌కు చెందిన దీపక్(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్‌కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు.
తిట్టిపోసిన అదే సోషల్ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్‌కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్ ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్‌లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్ అని అంటోంది.
షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్‌గానూ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్ వేధింపుల వీడియోను పోస్ట్ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్‌కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది(దానికి కామెంట్‌లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ..
కేరళ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. షిమ్జితా నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ చేసేసుకుందని తెలుస్తోంది.
ఆన్‌లైన్ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.


