ప్రభుత్వ అధినేతగా (ప్రధాని, గతంలో ముఖ్యమంత్రిగా) 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేంద్ర మోదీ. ఆయన మొట్టమొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వెనుక 2001లో భారతీయ జనతా పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కీలకంగా మారాయి. భుజ్ భూకంపం తర్వాత సహాయక చర్యలపై వచ్చిన విమర్శలు, ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయాలు, అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌పై పెరిగిన అసంతృప్తి, పార్టీలోని అంతర్గత విభేదాలు నాయకత్వ మార్పునకు దారితీశాయి.
గుజరాత్‌లోని భుజ్‌లో 2001 జనవరిలో సంభవించిన భారీ భూకంపం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అప్పటికి కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భూకంపం తర్వాత సహాయక, పునరావాస చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సహాయం, నిధులు వచ్చినప్పటికీ అవి ప్రజలకు సకాలంలో చేరడం లేదనే అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో కేశూభాయి ఆరోగ్యం కూడా క్షీణించింది.
ఈ పరిస్థితుల ప్రభావం ఎన్నికల ఫలితాల్లోనూ కనిపించింది. 2001 సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సబర్మతి అసెంబ్లీ స్థానంతో పాటు ఆనంద్ లోక్‌సభ స్థానాన్ని కోల్పోయింది. అవి కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. సబర్మతి బీజేపీకి బలమైన నియోజకవర్గంగా పరిగణించబడటం ఆ పార్టీ నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. 2002 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాయకత్వాన్ని మార్చకపోతే గుజరాత్‌లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్ర నాయకత్వం భావించింది.
మోదీ వ్యూహాత్మక పాత్ర
అప్పటికి నరేంద్ర మోదీ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్‌లో బీజేపీ సంస్థాగత వ్యవస్థపై కూడా ఆయనకు విస్తృత అవగాహన ఉంది. 1995లో గుజరాత్‌లో బీజేపీ తొలిసారి సొంతంగా మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మోదీ వ్యూహాత్మక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: భారీ ట్రాఫిక్.. ఆటోలోనే మగబిడ్డకు జన్మ
తొలుత కేశూభాయి ప్రభుత్వంలో మోదీని ఉప ముఖ్యమంత్రిగా పంపే ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆయన దాన్ని అంగీకరించలేదు. పూర్తి బాధ్యత, పని చేసే స్వేచ్ఛ ఉంటేనే గుజరాత్‌కు వెళ్తానని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీకి స్పష్టం చేశారు. వాజ్‌పేయి ఒకసారి మోదీతో, “ఢిల్లీలో పంజాబీ భోజనం చాలా చేశారు.. ఇప్పుడు గుజరాత్‌కు వెళ్లి అక్కడి బాధ్యతలు చూసుకోండి” అని సరదాగా చెప్పినట్లు కూడా ప్రస్తావించింది.
2001 అక్టోబర్ 6న మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు (అక్టోబర్ 7న) గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా, 2002 ఎన్నికల వరకు పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన నాయకుడిగా పలువురు చూశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అనంతరం రాజ్‌కోట్ ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు.
ఆ తాత్కాలిక ఏర్పాటుగా మొదలైన రాజకీయ ప్రయాణం తర్వాత భారత రాజకీయాల్లో కీలక అధ్యాయంగా మారింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ రాజకీయ ప్రస్థానం 2026 నాటికి 25 ఏళ్లకు పైగా కొనసాగుతోంది.


