ముంబై: మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో ఆస్పత్రికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల దూరంలో ఉండగానే ఓ గర్భిణి రిక్షాలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఆటో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆ మహిళకు పురిటి నొప్పులు రావడంతో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆ సమయంలో మరో వాహనం అందుబాటులో లేకపోవడంతో వారు రిక్షాను ఏర్పాటు చేసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే ఆటో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆటో ముందుకు కదల్లేదు. ఇదే సమయంలో మహిళకు పురిటి నొప్పులు మరింత తీవ్రం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆస్పత్రి కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనం ముందుకు వెళ్లలేకపోయింది. చివరకు ఆమె ఆటోరిక్షాలోనే బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ ఘటనతో వైద్య అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ రద్దీ కలిగించే ఇబ్బందులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ తల్లి, ఆమెకు పుట్టిన మగబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.


