దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం | venezuelas president delcy rodriguez visit india | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం

Jun 5 2026 4:02 AM | Updated on Jun 5 2026 4:28 AM

venezuelas president delcy rodriguez visit india

భారత ప్రధాని మోదీ, వెనెజువెలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: తమ పరస్పర అనుకూలతల ఆధారంగా దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, వెనెజువెలా దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అరుదైన ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, అటోమొబైల్స్‌ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. 

ఐదు రోజుల భారత పర్యటన కోసం డెల్సీ రోడ్రిగ్స్‌ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా పర్యటన ఆరంభించారు. పశి్చమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ముడి చమురు సేకరణను వైవిధ్యపరచాలని భారత్‌ భావిస్తోంది. ఈ తరుణంలో చమురు సంపన్న వెనెజువెలా అధ్యక్షురాలు భారత్‌లో అడుగుపెట్టడం విశేషం.

 వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, రాబోయే రోజుల్లో ఇంధన మార్కెట్‌లో స్థిరమైన కొనుగోలుదారుగా ఉండడం వంటి కారణాలతో భారత్‌ను ప్రాధాన్యత కలిగిన ఇంధన భాగస్వామిగా పరిగణిస్తున్నామని డెల్సీ రోడ్రిగ్స్‌ వెల్లడించారు. ఈ ఇంధన సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇరువురు నేతల మధ్య ప్రధానంగా ఇంధన భాగస్వామ్యం ఏర్పాటుపైనే చర్చ జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement