
అమెరికాకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి
రాజ్యసభలో మంత్రి కీర్తివర్ధన్ వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికా విద్యార్థి వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని ఆ దేశ ఉన్నతాధికార వర్గాల దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ తదితరాలను అమెరికా కఠినతరం చేయడం తెలిసిందే. దాంతో వీసా అపాయింట్‌మెంట్లు పొందడమే విద్యార్థులకు చాలా కష్టంగా మారిపోయింది.
ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలతో, ఢిల్లీలోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో దీనిపై లోతుగా చర్చించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ ఈ మేరకు వెల్లడించారు. భారత విద్యార్థుల ఆందోళనలను ఎప్పటికప్పుడు అమెరికా దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానమిచ్చారు.
అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించేవారు తదితరులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అన్నిరకాల చర్యలూ తీకుంటున్నట్టు జూన్ 18న విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వీసాల జారీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 14 మంది భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుల బృందం కూడా కృషి చేస్తోంది.
దెబోరా రాస్ వీరికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత విద్యార్థుల వాటా ఏటా 900 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని ఆమె అన్నారు. అంతేగాక పరిశోధనలు, ఇన్నొవేషన్లలో వారిది కీలక పాత్ర గుర్తు చేశారు. కొత్త వీసాల జారీని ఆపేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లన్నింటినీ ట్రంప్ సర్కారు గత మేలో ఆదేశించడం తెలిసిందే.
రెండు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ గత నెల మొదలైంది. కొత్త నిర్దేశకాల ప్రకారం వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాల తనిఖీ (వెట్టింగ్)ను అమెరికా పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందుకు వీలుగా సోషల్ ఖాతాల వివరాలను పబ్లిగ్గా అందుబాటులో ఉంచాల్సిందిగా ఆశావహులందరికీ సూచించింది.
అక్రమ వలసలపై...
అమెరికాలోకి అక్రమ వలసలు, మనుషుల అక్రమ రవాణా కట్టడిలో ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు వివరించారు. వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ–మైగ్రేట్ పోర్టల్, సోషల్ మీడియా హ్యాండిళ్లు తదితరాల ద్వారా ఈ విషయంలో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నట్టు చెప్పారు.