
ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భద్రతా దళాలు
పూంచ్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండగా.. ఇరు కుటుంబాలకు చెందినవారు గాయపడ్డారు.
కాల్పుల్లో గ్రామస్తుని మృతి
పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున పాక్ జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని భార్యతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడిని లోరాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్రార్‌గా గుర్తించారు. మెంధర్‌లోని చలేరి ప్రాంతానికి చెందిన లయాఖత్ హుస్సేన్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శుకవ్రారం తెల్లవారుజామున 3.50 గంటల నుంచి 4.45 గంటల మధ్య భారీ పేలుళ్లు సంభవించడంతో అధికారులు వెంటనే సైరన్లు మోగించారు.
కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు రాజౌరీ, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని ప్రాంతాలపై రాత్రికి రాత్రే కాల్పులు, షెల్లింగ్ జరిగాయి. ఈ కాల్పుల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని, పలు ఇళ్లు, వందలాది వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేశారు. సీనియర్ పోలీసు అధికారులు భద్రతా చర్యలను పర్యవేక్షించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల ప్రజలను జమ్మూతో పాటు పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు.
ఉరి సెక్టార్‌లో మహిళ మృతి
ఉరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీప ప్రాంతాల్లో పాక్ దళాలు గురువారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోని సిలికోట్, బోనియార్, కమల్‌కోట్, మొహ్రా, గింగ్లే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ షెల్లింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా మొహ్రా సమీపంలో కారును షెల్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందారు. షెల్లింగ్‌తో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక శుక్రవారం ఉరి సెక్టార్‌లోని టూర్నా పోస్టులో ఉన్న గౌహలన్, చోటాలీ ప్రాంతాల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. భారత పోస్టులు, పౌర ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.