
వాషింగ్టన్ డీసీ: అమెరికా విధించిన సుంకాల గడువు తరుముకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉందని ప్రకటించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఒకటి తమకు ఒక ముఖ్యమైన రోజు కానున్నదని, ఆ రోజున తమ దేశానికి పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
భారతదేశంతో తాము కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చెబుతూనే, దీనిపై భారతదేశం- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ఆ సమావేశంలో తెలిపారు. ఆగస్టు ఒకటిన తమ దేశానికి గణనీయంగా డబ్బు వస్తుందని, తాము పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పడు ఇంకో ఒప్పందం కుదరబోతోందని, అది బహుశా భారతదేశంతో కావచ్చని, దీనిపై చర్చల్లో ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. వారికి తాము ఒప్పందానికి సంబంధించి, ఒక లేఖ పంపామని తెలిపారు. భారతదేశంతో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు.
భారత మార్కెట్లకు లబ్ధి చేకూర్చే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని అన్నారు. కాగా భారత్- అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (బీటీఏ) ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మేరకు ముందుకు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం ఐదవ రౌండ్ చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు ఏఎన్‌ఐకి తెలిపారు.