మూడు బుల్లెట్ల మిస్టరీ!  | Three 9mm cartridges found at Delhi Red Fort premisess | Sakshi
Sakshi News home page

మూడు బుల్లెట్ల మిస్టరీ! 

Nov 17 2025 1:01 AM | Updated on Nov 17 2025 1:01 AM

Three 9mm cartridges found at Delhi Red Fort premisess

ఎర్రకోట వద్ద పేలుడు ప్రదేశంలో స్వాదీనం  

ఒకటి కార్‌ట్రిడ్జ్‌.. మరో రెండు లైవ్‌ బుల్లెట్లు  

లభ్యం కాని తుపాకీ 

ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు 

న్యూఢిల్లీ: ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట వద్ద ఘటనా స్థలానికి సమీపంలోనే మూడు తుపాకీ తూటాలను స్వాదీనం చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై దర్యాప్తు మొదలైంది. ఇందులో ఒకటి తూటా తొడుగు(కార్‌ట్రిడ్జ్‌) కాగా, మరో రెండు లైవ్‌ బుల్లెట్లు అని అధికారులు చెప్పారు. ఇవి 9ఎంఎం తూటాలు. 

సైనిక దళాలు లేదా స్పెషలైజ్డ్‌ యూనిట్లు లేదా ప్రత్యేక అనుమతి కలిగిన వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు జారీ చేస్తుంటారు. ఈ నెల 10వ తేదీన ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఈ తూటాలు భద్రతా సిబ్బందికి సంబంధించినవేనా? అని తనిఖీ చేయగా, అలాంటిదేమీ లేదని తేలింది. బాంబు పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారు పక్కనే ఈ తూటాలు లభించాయి. కానీ, అక్కడ తుపాకీ కనిపించలేదు. మొత్తానికి బుల్లెట్ల మిస్టరీని ఛేదించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

విదేశాల నుంచి రూ.20 లక్షలు!  
పేలుడు ఎలా జరిగిందో గుర్తించడానికి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు సిద్ధమవుతున్నారు. నిందితుడు ఉమర్‌ నబీ హరియాణాలోని ఫరీదాబాద్‌ నుంచి బయలుదేరాడు. నూహ్‌ పట్టణంలో తలదాచుకున్నాడు. తర్వాత ఢిల్లీకి చేరుకొని ఒక చోట టీ తాగాడు. ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడి, తాను కూడా మరణించాడు. ఈ మొత్తం మార్గంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయబోతున్నారు. 

అతడు ఎవరెవరిని కలిశాడు? అతడిని ఎవరు అనుసరించారు? ఎవరు సహకరించారు? అనేది గుర్తించబోతున్నారు. ఈ కేసులో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిందితులైన ముజమ్మిల్, షహీన్‌లు హవాలా మార్గంలో డబ్బులు స్వీకరించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న హ్యాండర్ల నుంచి వారికి రూ.20 లక్షలు అందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ సొమ్ముతో మొత్తం ముగ్గురు నిందితులు పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నట్లు అంచనా వేస్తున్నారు. 

బాంబును తయారు చేయడానికి ట్రైఅసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌(టీఏటీపీ) ఉపయోగించినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. అది చాలా అస్థిరమైనది, సున్నితమైనది. కాస్త వేడి తగిలినా, రాపిడికి గురైనా వెంటనే పేలిపోతుంది. మరోవైపు అల్‌–ఫలా యూనివర్సిటీలో ఆధారాల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అరెస్టయిన డాక్టర్లతో సంబంధాలున్నవారిని ప్రశ్నిస్తున్నారు. ఉమర్, ముజమ్మిల్, షహీన్‌తో సన్నిహిత సంబంధాలున్న పలువురు వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి హఠాత్తుగా కనిపించకుండాపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.   

మరో నిందితుడు అమీర్‌ రషీద్‌ అలీ అరెస్టు  
ఢిల్లీలో పేలుడు సూసైడ్‌ బాంబర్‌ ఉమర్‌ నబీతో కలిసి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న అమీర్‌ రషీద్‌ అలీని ఎన్‌ఐఆర్‌ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఇదొక కీలక మలుపు అని చెబుతున్నారు. అమీర్‌ రషీద్‌ అలీ స్వస్థలం కశ్మీర్‌. అతడిపైన ఇప్పటికే కేసు నమోదయ్యింది. పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారును కొనుగోలు చేయడానికి అతడు సహకరించినట్లు సమాచారం. ఆ కారు అమీర్‌ రషీద్‌ అలీ పేరిటే రిజిస్టర్‌ అయ్యింది. అతడిని ప్రశ్నిస్తే మరింత కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఐ20 కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఎర్రకోట వద్ద పేల్చేసినట్లు ఎన్‌ఐఏ సిబ్బంది అధికారికంగా ధ్రువీకరించారు.  

జమ్మూకశ్మీర్‌లో కొత్త నియామకాలు   
ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో కొత్త నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. గతం ఎలాంటి నేర చరిత్ర గానీ, వేర్పాటువాదులతో సంబంధాలు గానీ లేని యువకులను చేర్చుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా అనుసరించిన వ్యూహానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భద్రతా దళాల నిఘాకు చిక్కకుండా ఈ ఎత్తుగడ వేశారని వెల్లడించారు. వైట్‌కాలర్‌ టెర్రర్‌ నెట్‌వర్క్‌ కొత్త వ్యూహం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ పేలుడు కేసులో నిందితులైన డాక్టర్‌ అదీల్‌ రాథర్, డాక్టర్‌ ముజఫర్‌ రాథర్, డాక్టర్‌ ముజమ్మిల్‌కు గతంలో నేర చరిత్ర లేదు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వారు పాల్గొనలేదు. అలాంటివారినే ఉగ్రవాదులు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

సూసైడ్‌ బాంబర్‌ కోసం ఏడాదిగా గాలింపు!  
ఢిల్లీలో పేలుడుకు కుట్ర చాలా కాలంనుంచే సాగింది. తమకు అవసరమైన సూసైడ్‌ బాంబర్‌ కోసం ముష్కరులు ఏడాది కాలంపాటు అన్వేíÙంచారు. చివరకు వారికి డాక్టర్‌ ఉమర్‌ నబీ దొరికాడు. వైట్‌కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ ఆదేశాలను పాటించాడు. ఢిల్లీలో కారు బాంబు పేల్చేశాడు. దర్యాప్తులో అధికారులు ఈ విషయాలను గుర్తించారు.

హరియాణా మహిళా డాక్టర్‌ విచారణ   
ఢిల్లీ పేలుడు కేసులో హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన మహిళా డాక్టర్‌ ప్రియాంక శర్మను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముష్కరులతో సంబంధాల గురించి ఆరా తీశారు. ఆమె ప్రస్తుతం దక్షిణ జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్నారు. ప్రశ్నించిన అనంతరం ప్రియాంక శర్మను విడిచిపెట్టారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపించబోతున్నారు. డాక్టర్‌ అదీల్‌ అరెస్టు తర్వాత ప్రియాంక శర్మ పేరు తెరపైకి వచ్చింది. అదీల్‌ కాల్‌ రికార్డుల్లో ఆమె ప్రస్తావన కూడా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement