
ఈ ఏడాది తొలి 6 నెలల్లో బీభత్సం సృష్టించిన ప్రకృతి విపత్తులు
2024లో 1.18 లక్షల మంది బాధితులు
ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తులు పంజా విసురుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, భీకరమైన వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం నష్టపోతున్నారు. శాశ్వత లేదా తాత్కాలిక ఇళ్లు, ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. 2024లో దేశంలో 400కుపైగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే ఇదే అత్యధిక కావడం గమనార్హం. గత ఏడాది విపత్తుల వల్ల 1.18 లక్షల మందికిపైగా జనం నిరాశ్రయులయ్యారని ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది.
2023 కంటే 2024లో నిరాశ్రయుల సంఖ్య 30 శాతం అధికం అని తెలియజేసింది. 2021లో 22,000 మంది, 2022లో 32,000 మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొంది. ప్రకృతి విపత్తులు ప్రతిఏటా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2019 నుంచి 2023 మధ్య 281 విపత్తుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024లో మాత్రం ఏకంగా 400కు పైగా విపత్తులు సంభవించాయి. గత ఆరేళ్లలో జనం నిరాశ్రయులు కావడానికి వరదలు 55 శాతం, తుఫాన్లు 44 శాతం కారణమని తేలింది. కొండ చరియలు విరిగిపడడం, భూకంపాలు, కరువుల వల్ల కూడా జనం ఆశ్రయం కోల్పోతున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం
2024లో 1.18 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 2025లో మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది బాధితులుగా మారిపోయినట్లు ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పశ్చిమ బెంగాల్‌తోపాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలే అధికంగా ప్రకృతి విపత్తుల బారినపడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 80,000 మంది నిరాశ్రయులయ్యారు.