పంజాబ్‌, కశ్మీర్‌లో తెలుగు విద్యార్థులు ఆవేదన | Telugu States Students At Punjab And Srinagar | Sakshi
Sakshi News home page

పంజాబ్‌, కశ్మీర్‌లో తెలుగు విద్యార్థులు ఆవేదన

May 10 2025 10:28 AM | Updated on May 10 2025 10:50 AM

Telugu States Students At Punjab And Srinagar

ఢిల్లీ: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో పంజాబ్‌లో, జమ్ము కశ్మీర్‌లోనే చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌, ఏపీ భవన్ సదుపాయం కల్పించాలని కోరారు.

భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్‌లో యూనివర్సిటీల పరీక్షలు వాయిదా వేశారు. తక్షణమే ఇంటికి వెళ్లి పోవాలని యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఎల్పీయూ యూనివర్సిటీలోని పలువురు తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు విద్యార్థులు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘రాత్రి సమయంలో పెద్ద ఎత్తున భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. మా యూనివర్సిటీ పైనుంచి డ్రోన్లు వెళ్లాయి. మాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే ఇంటికి వచ్చేయాలని మా పేరెంట్స్ చెప్పారు. ఏపీ, తెలంగాణ భవన్‌లో మాకు వసతి, భోజన సదుపాయం కావాలి అని కోరారు.

మరోవైపు.. శ్రీనగర్‌లోని ఎన్‌ఐటీలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్‌ఐటీలో 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరిలో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో ఆందోళన చెందుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. వారిని అధికారులు స్వస్థలాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement