
అన్నానగర్: ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి వచ్చిన ఉదంతమిది. ప్రియుడి కోసం ప్రియురాలు తన దగ్గరున్న నగలు అమ్ముకుని మరీ శ్రీలంక నుంచి నకిలీ పడవలో భారత్‌కు వచ్చిన ఘటన బుధవారం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. అరిచలమునై బీచు బుధవారం ఉదయం ఓ యువతి శరణార్థిగా వచ్చిందని కోస్టల్ పోలీసులకు సమాచారం అందింది.
ఆ మహిళను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీలంకలోని మన్నార్‌కు చెందిన విదుర్షియ (25) తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఒక శరణార్థి శిబిరంలో తన తల్లి, తండ్రితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. గత ఏప్రిల్లో ఆమె శ్రీలంకకు వెళ్లగా, తిరిగి అక్కడి నుంచి భారత్‌కు రావడానికి వీసా పొందలేకపోయింది.
అయితే ఆమె తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నకిలీ పడవలో రావాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆ మహిళ తన నగలను అమ్మి వచ్చిన నగదుతో తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవ ఎక్కి అరిచల్ మునైకి చేరుకుంది. దర్యాప్తు అనంతరం ఆ యువతిని మండపం శరణార్థి శిబిరానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.