ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
కోర్టు రద్దుచేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో మళ్లీ ప్రవేశపెట్టారని ఆక్షేపణ
చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం నాలుగేళ్లేనన్న నిబంధన కొట్టివేత
నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ సంస్కరణల(హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం–2021 విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకం, పదవీ కాలం, సర్వీసు నిబంధనలపై కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన కొన్ని నిబంధనలను స్వల్ప మార్పులతో సంస్కరణల పేరిట ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టిందని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ అతిక్రమించడం తగదని స్పష్టంచేసింది. పాత నిబంధనలనే చిన్నచిన్న మార్పులతో మళ్లీ తీసుకురావడం ఏమిటని ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్ సంస్కరణల(హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం–2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం విచారణ పూర్తిచేసింది.
బుధవారం 137 పేజీల తీర్పు వెలువరించింది. కీలక అంశాలపై ఇచ్చిన తీర్పులను, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి ఇష్టపడడం లేదని, ఈ ధోరణి నిజంగా గర్హనీయమని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ట్రిబ్యునళ్ల స్వతంత్రతను కాపాడడంతోపాటు వాటి పనితీరు, కార్యకలాపాలను నిర్దేశిస్తూ ఇచ్చిన విస్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి, ఆర్డినెన్స్‌లోని కొన్ని పాత నిబంధనలను మార్పులు చేసి చట్టంరూపంలో మళ్లీ పవేశపెట్టడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. దీనివల్ల చట్టంపై రాజ్యాంగపరమైన చర్చకు తెరలేచినట్లయ్యిందని వెల్లడించింది.
పదవీ కాలంలో స్థిరత్వం అవసరం
ట్రిబ్యునళ్లలో నియామకానికి కనీసం 50 ఏళ్ల వయసు ఉండాలంటూ పార్లమెంట్‌లో తీసుకొచ్చిన నిబంధనతోపాటు మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ మద్రాసు బార్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం కేవలం నాలుగేళ్లే అంటూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను కొట్టిపారేసింది. అలాగే ట్రిబ్యునల్స్‌లో నియామకాలకు ప్రతి పదవికి ఇద్దరి పేర్లను సెలక్షన్ కమిటీ ప్రతిపాదించాలంటూ తెచ్చిన మరో నిబంధనను కూడా తోసిపుచ్చింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సభ్యుల పదవీ కాలంలో స్థిరత్వం, వారి హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని ఉద్ఘాటించింది. కోర్టులో ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం సరైంది కాదని సూచించింది.
కొత్త సీసాలో పాత సారా
ట్రిబ్యునల్స్ సంస్కరణల(హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం–2021.. ట్రిబ్యు నల్స్ సంస్కరణల(హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనల) ఆర్డినెన్స్–2021కు దాదాపు ప్రతిరూపంగానే ఉందని, కొత్త సీసాలో పాత సారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగపరంగా లోపంతో కూడుకున్న అంశాన్ని కోర్టు తిరస్కరిస్తే పార్లమెంట్ అదే అంశాన్ని మరో రూపంలో తీసుకురావడం న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని అతిక్రమించినట్లే అవుతుందని స్పష్టంచేసింది. కోర్టు గుర్తించిన లోపాన్ని సరిచేయడమే పార్లమెంట్ విధి అని సూచించింది. కోర్టులపై ఇప్పటికే పెండింగ్ కేసుల భారం పెరిగిపోతోందని గుర్తుచేసింది. ఈ భారాన్ని తగ్గించే బాధ్యత కేవలం కోర్టులపైనే కాకుండా అందరిపైనా ఉందని పేర్కొంది. ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని కోరింది.
ట్రిబ్యునళ్ల స్వతంత్రత, పారదర్శకతను కాపాడడంతోపాటు నియామకాలు, పరిపాలనలో ఏకరూపత కోసం నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి తేల్చిచెప్పింది. ఇందుకోసం నాలుగు నెలల సమయం ఇస్తున్నామని తెలిపింది. తమ ఆదేశాల మేరకు ఈ కమిషన్ పని చేయాలని వెల్లడించింది. ట్రిబ్యునళ్ల సభ్యుల పదవీకాలానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా ధర్మాసనం పునరుద్ధరించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులు 62 ఏళ్లు వచ్చేవరకు పదవిలో కొనసాగవచ్చని తెలియజేసింది. ట్రిబ్యునల్స్ చైర్మన్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్ల వరకు ఉంటుందని పేర్కొంది.


