సీబీఎస్‌ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు | Supreme Court Issues Notice To Centre Over Cbse Three Language Policy | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

May 27 2026 4:41 PM | Updated on May 27 2026 4:46 PM

Supreme Court Issues Notice To Centre Over Cbse Three Language Policy

ఢిల్లీ: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో 9,10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. కేంద్రం, ఎన్‌సీఈఆర్టీ( NCERT)కి నోటీసులు ఇచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్‌మల్య బాగ్చీ, విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఈఆర్‌టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

అయితే, 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్‌ఈ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్‌ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్‌ పరీక్ష కూడా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్‌ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement