తప్పు చేసి ప్రైవసీ అంటే కుదరదు | SC upholds Delhi HC order rejecting adulterous man's claim to right to privacy in divorce case | Sakshi
Sakshi News home page

తప్పు చేసి ప్రైవసీ అంటే కుదరదు

Jul 5 2026 5:00 AM | Updated on Jul 5 2026 5:00 AM

SC upholds Delhi HC order rejecting adulterous man's claim to right to privacy in divorce case

విడాకుల కేసులో సుప్రీంకోర్టు స్పష్టికరణ 

ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన 

ఆధారాల సేకరణలో కోర్టులు సాయం చేయవచ్చు

న్యూఢిల్లీ: భర్త తప్పు చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని చెప్పజాలరని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకుల కోసం వ్యభిచారం ఆరోపణలు రుజువు చేసే కాల్‌డేటా, హోటల్‌ బుకింగ్‌ వంటి ఆధారాలు సేకరించేందుకు భార్య న్యాయస్థానం సాయం తీసుకోవడంలోనూ తప్పులేదని జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యభిచారాన్ని వ్యక్తిగత ప్రైవసీ పేరుతో రక్షణ కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 2023 మే 10వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.

వ్యక్తిగత గోప్యతకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ దానిపై కొన్ని పరిమితులున్నాయని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహమైనప్పటికీ ఇతర మహిళతో అక్రమ సంబంధం నెరపిన వ్యక్తి తాలూకూ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కిందకు రావు అని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త ఇంకో స్త్రీతో కూతురిని కన్నాడని, మరో మహిళతోనూ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఒక హోటల్‌లో భర్త, ఒక మహిళ కలిసి ఉన్నారని ఇందుకు సంబంధించిన వివరాలు, హోటల్‌ రిజర్వేషన్, పేమెంట్‌ రికార్డులను కాపాడాలని అభ్యర్ధించింది.

విచారణ జరిపిన న్యాయస్థానం వివరాలను జాగ్రత్త చేయాలని, సీల్డ్‌ కవర్‌లో తమకు అందజేయాలని 2022లో∙ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆధారాలు ఆ వ్యక్తి అక్రమ సంబంధాన్ని రుజువు చేసేందుకు సరిపోతాయా? అని ఫ్యామిలీకోర్టు స్పష్టం చేయలేదు. ఇదే విషయమై భర్త ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లాడు. వివరాలు సేకరించడంతో తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు వ్యక్తిగత గోప్యత కంటే సాక్ష్యాల కోసం భార్య అభ్యర్థన ముఖ్యమని స్పష్టం చేసింది.

అక్రమ సంబంధాన్ని రుజువు చేసే ఇలాంటి ఆధారాలు చాలా అరుదుగా లభిస్తాయని తెలిపింది. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ అనుమతించని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకునేందుకు ఫ్యామిలీ కోర్టు నిబంధనలు సెక్షన్‌ 14 అనుమతిస్తుందని తెలిపింది. హోటల్‌ రిజర్వేషన్, గుర్తుంప కార్డులతో ఉంటే భర్త మరో మహిళతో ఉన్నట్లు తెలుపుతుందని, కాల్‌ రికార్డులు ఎన్నిసార్లు ఆ మహిళకు కాల్‌ చేశారు? అసాధారణంగా ఎంతసేపు మాట్లాడారు అన్నది స్పష్టం చేస్తుందని కోర్టు వివరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం అక్రమ సంబంధం కలిగి ఉండటం విడాకుల మంజూరుకు ప్రాతిపదిక అని, వ్యక్తిగత గోప్యత పేరుతో భర్తను కాపాడటంలో ప్రజా ప్రయోజనమేమీ లేదని స్పష్టం చేస్తూ భర్త పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement