
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: బంజారా, లంబాడీ, సుగాలీ కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.
పిటిషనర్లు పోడియం బాలరాజు, మోడి యం శ్రీనివాసరావు సహా మరో ఇద్దరి తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్‌తో పాటు న్యాయవాదులు అల్లంకి రమేశ్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఆర్.మమత వాదనలు వినిపించారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342కు పూర్తిగా విరుద్ధమని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసలైన ఆదివాసీ తెగలతో పోలిస్తే ఈ వర్గాలు ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగాఅభివృద్ధి చెందాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రధాన పిటిషన్లతో ఈ వ్యాజ్యాలను జత చేయా లని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.