
తక్కువ మార్కులొచ్చినా అక్కున చేర్చుకుంటున్నారు
పోల్చి తిట్టటం మాని ‘‘పర్వాలేదులే’’ అంటున్నారు
తల్లిదండ్రుల గొప్పతనాన్ని షేర్ చేస్తున్న విద్యార్థులు
సోషల్ మీడియాలో పేరెంట్స్‌పై అభినందనల జల్లు
మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్
మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు.
‘ఈసారి వస్తాయిలే..!’
తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు.
ఇది మంచి పరిణామం
బోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.
‘కేక్, పిజ్జా తెప్పించారు’
ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు.
ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్‌ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు.
‘ముందే చెప్పేశా..’
మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్‌కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు.
‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!
వెల్‌డన్ పేరెంట్స్
» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..
» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.
» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.
» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.
» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.
» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.
» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.
» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు.