41% లోటు వర్షపాతం | southwest monsoon stalled over southern Maharashtra | Sakshi
Sakshi News home page

41% లోటు వర్షపాతం

Jun 19 2026 2:43 AM | Updated on Jun 19 2026 2:43 AM

southwest monsoon stalled over southern Maharashtra

మహారాష్ట్ర నుంచి ముందుకు సాగని నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ: చినుకులతో రైతన్నకు చిరునవ్వులు తెప్పించే నైరుతి రుతుపవనాలు ఈసారి కర్షకులతో దోబూచులాడుతున్నాయి. దీంతో జూన్‌ 4 నుంచి జూన్‌ 18వ తేదీ వరకు నమోదవ్వాల్సిన వర్షపాతంలో 41 శాతం లోటు కన్పించిందని భారత వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజా గణాంకాలను విడుదలచేసింది. జూన్‌ 4వ తేదీ నుంచి రెండు వారాలపాటు సగటున 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం దక్కిందని వాతావరణ శాఖ వ్యాఖ్యానించింది.

ప్రాంతాల వారీగాచూస్తే మధ్యభారతం(67శాతం), తూర్పు, ఈశాన్య భారతం(42శాతం), దక్షిణభారతం(22 శాతం), వాయవ్యభారతం(6శాతం) లోటు వర్షపాతాలను చవిచూశాయి. రుతుపవనాలు బలంగా, వేగంగా ముందుకు కదలడానికిదోహదపడే విస్తృతస్థాయి వర్షపాత అనుకూల పరిస్థితులు పూర్తి స్థాయిలో లేవు. అందుకే రుతుపవనాలు మహారాష్ట్ర అంతటా విస్తరించకుండా అక్కడే ఆగిపోయాయి. దీంతో దక్షిణభారతంలోని ఇతర రాష్ట్రాలకు రుతపవనాల విస్తృతస్థాయి విస్తరణ ఆలస్యమవుతోంది.  

ఎందుకీ లోటు? 
ఉత్తరదిశలో విస్తరణ ఆలస్యం కావడానికి ఐదు అంశాలు కారణమవుతున్నాయి. అరేబియా సముద్రం నుంచి తోడ్పాటు కరువైంది. అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు తక్కువ స్థాయిలో రావడంతో రుతుపవనాల విస్తరణ వేగం తగ్గింది. అరేబియా సముద్రం మీదుగా తక్కువ ఎత్తులో భారత్‌లో ఈశాన్య వైపునకు వీచే గాలులు తగ్గిపోయాయి. ఇవి తగ్గడంతో తేమ సమతులంగా మహారాష్ట్రపై బట్వాడా కావడం సైతం క్షీణించింది. దక్షిణార్థ గోళం నుంచి ఉత్తరార్థ గోళం దిశగా వస్తూ హిందూ మహాసముద్ర పశ్చిమ భాగం, అరేబియా సముద్రం మీదుగా సాగే గాలుల్లోనూ వేగం తగ్గింది. ఈ గాలులే నైరుతు రుతుపవనాలకు తేమను అందిస్తాయి. తేమ తగ్గడంతో వర్షపాతమూ తగ్గిపోయింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement